వీడియో ఆధారంగా ఓ అభిప్రాయానికి రాలేం | Sakshi
Sakshi News home page

వీడియో ఆధారంగా ఓ అభిప్రాయానికి రాలేం

Published Wed, Apr 13 2016 3:51 AM

shruti and sagar encounter reaction

శ్రుతి, సాగర్ ఎన్‌కౌంటర్ కేసులో హైకోర్టుకు విన్నవించిన ఎయిమ్స్
 
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన శ్రుతి, విద్యాసాగర్‌లకు స్థానిక వైద్యులు పోస్టుమార్టం నిర్వహణకు సంబంధించిన వీడియో ఆధారంగా నిర్దిష్ట అభిప్రాయానికి రావడం సాధ్యం కాదని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) వైద్యులు తేల్చి చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందంతో చర్చించిన తరువాతనే ఓ అభిప్రాయానికి రాగలమని హైకోర్టుకు నివేదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... ఎయిమ్స్ వైద్యులు కోరుతున్న విధంగా పోస్టుమార్టం తాలూకు డాక్యుమెంట్లు, దాన్ని నిర్వహించిన వైద్యుల ఫోన్ నంబర్లు, ఎఫ్‌ఐఆర్ తదితర వివరాలు  పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అన్నింటినీ పరిశీలించి జూన్ 15 లోపు అభిప్రాయాన్ని తెలియచేయాలని ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. ఈ  వ్యవహారంలో సమన్వయ బాధ్యతలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌కు అప్పగిస్తూ, తదుపరి విచాణను జూన్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిమ్స్ వైద్యులు ఇచ్చే నివేదికను సీల్డ్ కవర్‌లోనే అందచేయాలని శరత్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement