
ప్రాజెక్టుకు అనుమతుల పునఃపరిశీలనకు 22న ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం
ఎస్సారెస్పీ–2, కాళేశ్వరం, సమ్మక్క ప్రాజెక్టుల కింద ఒకే ఆయకట్టు స్థిరీకరణను ప్రతిపాదించిన గత సర్కారు
దీనిపై గతంలో అభ్యంతరం తెలిపిన సీడబ్ల్యూసీ.. 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ప్రతిపాదించాలని సూచన
ఛత్తీస్‌గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలని మెలిక.. ముంపు లెక్కల్లో తేడాతో కుదరదన్న పొరుగు రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టు చిక్కుల్లో పడింది. ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు నిరాకరించగా ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు బదులుగా మరోచోట కొత్తగా 2 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్రాన్ని కోరింది. వాస్తవానికి శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ) ప్రాజెక్టు రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును సమ్మక్క–సాగర్ ప్రాజెక్టు కింద స్థిరీకరిస్తామని గత ప్రభుత్వం డీపీఆర్‌లో ప్రతిపాదించింది.
అలాగే ఇదే 4.40 లక్షల ఎకరాల ఆయకట్టునే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద సైతం స్థిరీకరిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ మదింపు సందర్భంగా కేంద్ర జల సంఘం గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే ఆయకట్టును ఎస్సారెస్పీ–2, కాళేశ్వరం, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల కింద ఎలా ప్రతిపాదిస్తారంటూ కేంద్ర జలసంఘం రాష్ట్ర నీటిపారుదల శాఖ నుంచి వివరణ కోరింది. దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియకు బ్రేక్ పడింది.
ఈ అంశాలను పునఃపరిశీలించడానికి ఈ నెల 22న ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జలసంఘం రాష్ట్ర నీటిపారుదల శాఖకు తెలియజేసింది. రూ. 9,257 కోట్లతో చేపట్టిన సమ్మక్కసాగర్ ప్రాజెక్టు (తుపాకులగూడెం బరాజ్) పనులు 95 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టు ప్రయోజనాలు వ్యయాల (బెన్ఫిట్ కాస్ట్ రేషియా) మధ్య నిష్పత్తిని 1.67:1గా అంటే.. ప్రాజెక్టుపై రూపాయి వెచ్చిస్తే రూ. 1.67 రాబడి వస్తుందని డీపీఆర్‌లో అంచనా వేశారు. మెరుగైన వ్యయ నిష్పత్తిని చూపేందుకే ఎస్సారెస్పీ రెండోదశ ఆయకట్టు స్థిరీకరణను సైతం సమ్మక్క ప్రాజెక్టు ఖాతాలో ప్రభుత్వం వేయగా కేంద్ర జల సంఘం పరిశీలనలో దొరికిపోయింది.
సమ్మక్క బరాజ్ బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోసిన నీటిని ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు సాధించాలంటే కొత్తగా 2 లక్షల ఎకరాల ప్రత్యేక ఆయకట్టును ప్రతిపాదించడంతోపాటు ఛత్తీస్‌గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది.
ముంపు ముప్పుపై ఐఐటీ–ఖరగ్‌పూర్ ద్వారా సర్వే..
ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలను పరిష్కరించి ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చి సమర్పించాలని సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రభుత్వానికి పలుమార్లు సూచించింది. ఈ నేపథ్యంలో 2023 సెప్టెంబర్ 6–9 మధ్య సమ్మక్క బరాజ్‌ను ఛత్తీస్‌గఢ్ అధికారులు పరిశీలించారు. సర్వే ద్వారా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి భూసేకరణ ప్రక్రియను వేగిరం చేయాలని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు.
బరాజ్ వల్ల కలిగే ముప్పుపై ఐఐటీ ఖరగ్‌పూర్‌తో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయించగా బరాజ్ వద్ద 87 మీటర్ల గరిష్ట వరద సంభవిస్తే బీజాపూర్ జిల్లాలోని పోటూరు, కౌటూరు, తుగ్లగూడ, గంగారం, కంబాలపేట, సీతానగరంలో 100 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేలింది. తక్కువ ముంపు ఉండనుందని తేలడంతో ఛత్తీస్‌గఢ్ నిరభ్యంతర పత్రం ఇచ్చే అవకాశాలు మెరుగయ్యాయి.
ఛత్తీస్‌గఢ్ ససేమిరా అనడంతో...
ములుగు జిల్లాలో గోదావరిపై తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ బరాజ్‌లో పూర్తిస్థాయి నిల్వ మట్టం 83 మీటర్ల మేర నీటిని నిల్వ చేస్తే ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌కు పలుమార్లు తెలిపింది. అయితే 2022 జూలై 17, 19వ తేదీల్లో వచ్చిన 88 మీటర్ల గరిష్ట వరదను ప్రామాణికంగా తీసుకొని ఆ మేరకు వరద వస్తే ముంపునకు గురికానున్న భూములన్నింటికీ పరిహారం చెల్లించాలని ఛత్తీస్‌గఢ్ డిమాండ్ చేస్తోంది.
2021 సెప్టెంబర్‌లో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి డీపీఆర్ దాఖలు చేసింది. దీంతో దీనిపై అభ్యంతరాలు/అభిప్రాయాలు తెలియజేయాలని కోరుతూ సీడబ్ల్యూసీ ఆ డీపీఆర్‌ను ఛత్తీస్‌గఢ్ పరిశీలనకు పంపింది. ఫలితంగాసీడబ్ల్యూసీలోని అన్ని డైరెక్టరేట్లు అనుమతులిచ్చినా ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలతో డీపీఆర్ ముందుకు కదల్లేదు.