అజ్ఞాతంలోనే తుమ్మల శ్రీనివాస్‌ అలియాస్‌ విశ్వనాథ్‌ | Maoist Leader Tummala Srinivas Alias Vishwanath Remains Underground, Know More Details Inside | Sakshi
Sakshi News home page

అజ్ఞాతంలోనే తుమ్మల శ్రీనివాస్‌ అలియాస్‌ విశ్వనాథ్‌

Oct 18 2025 12:19 PM | Updated on Oct 18 2025 1:17 PM

Maoist Leader Tummala Srinivas Alias Vishwanath Remains Underground

సామూహిక సాయుధ లొంగుబాటుతో ఆశలు

అజ్ఞాతంలోనే జిల్లాకు చెందిన ఇద్దరు

కన్నుమూసిన కన్నవాళ్లు

‘అడవిలో అన్నల’ సోదరుల నిరీక్షణ

సిరిసిల్ల: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో తొలిసారి నక్సలైట్లు ఆయుధాలను అప్పగించి సామూహికంగా లొంగుబాటు మొదలైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని సాయుధ నక్సలైట్లు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారు. నాలుగు దశాబ్దాల కిందట ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్‌వార్‌) పార్టీ ఉద్యమం బలంగా ఉండేది. సమసమాజ స్థాపన కోసం ఆయుధాలను పట్టి ఎందరో అడవిబాట పట్టారు. ఏళ్లుగా ఉద్యమదారుల్లో నడిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు నేపథ్యంలో ‘మావో’ళ్లు ఇంటికి వస్తారా ! అంటూ ఆ అజ్ఞాతవాసుల కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. జనజీవనంలోకి వస్తారా? అజ్ఞాతంలోనే ఉంటారా? అనే చర్చ సాగుతోంది.

27 ఏళ్ల కిందట అడవిబాట
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపలి్లకి చెందిన తుమ్మల శ్రీనివాస్‌ అలియాస్‌ విశ్వనాథ్‌ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 27 ఏళ్లుగా శ్రీనివాస్‌ జాడతెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా.. తల్లి భూదమ్మ ఎనిమిదేళ్ల కిందట మరణించింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపులకు శ్రీనివాస్‌ రాకపోవడం విషాదం.

పోలీస్‌ కౌన్సెలింగ్‌తోనే వెలుగులోకి...
శ్రీనివాస్‌ డిగ్రీ చదువుతూ కనిపించకపోవడంతో ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు శ్రీనివాస్‌ అలియాస్‌ విశ్వనాథ్‌ పేరుతో నక్సలైట్‌ ఉద్యమంలో పనిచేస్తున్నాడని గుర్తించి.. బండలింగంపలి్లలోని అతని తల్లిదండ్రులు నారాయణ, భూదమ్మ ఇంటికెళ్లి.. కొడుకును లొంగిపోయేలా చూడండి.. అంటూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సంఘటనతోనే కొడుకు అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిసింది. ఒడిషా ప్రాంతంలో పనిచేస్తున్నాడని తరా>్వత వారికి తెలిసింది. కానీ ఆచూకీ లభించలేదు. కన్న కొడుకును చూడకుండానే తల్లిదండ్రులు కన్నుమూశారు.

రా అన్నా.. కలిసుందాం 
అన్నను 27 ఏళ్లుగా చూడలేదు. ఎక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగినా ఆందోళనగా ఉండేది.  ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతున్నారు. నువ్వు కూడా రా అన్న     కలిసుందాం. 27 ఏళ్లుగా మన ఇల్లు ఎదురు        చూస్తోంది. అమ్మానాన్నలు కాలం చేశారు. ఉద్యోగం చేస్తూ తలోదిక్కు వెళ్లాం. ఇప్పుడు మన ఇల్లు         ఒంటరైంది. మీరు వస్తే కలిసి ఉందాం. 
– తుమ్మల మధుసూదన్, విశ్వనాథ్‌ సోదరుడు(టీచర్‌)

తమ్మీ రారా..
నాకు పానం బాగా లేదు. అమ్మానాయిన్నలు, తమ్ముడు కాలం చేసిండ్రు. అడవిలో అన్నలు అందరూ తుపాకులు పోలీసులకు ఇచ్చి వస్తున్నారని తెలిసింది. నువ్వు కూడా ఎక్కడ ఉన్నా ఇంటికి రా.. తమ్మీ. ప్రజల కోసం నలభై ఏళ్లు అడవుల్లో పనిచేసినవ్‌ చాలు. ఇగ నువ్వు వస్తే కలోగంజో కలిసి తాగుదాం. నిన్ను చూసి సచ్చిపోవాలని ఉంది. నువ్వు వస్తావని ఆశతో చూస్తున్నా.         ఏడున్నా రా తమ్మీ.   
  – బండి నాంపల్లి, చంద్రయ్య సోదరుడు, ధర్మారం

నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే..
రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రయ్య అలియాస్‌ మహేశ్‌ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు. పదోతరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న చంద్రయ్య 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యలకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక్క కూతురు శాంతమ్మ. చిన్నకొడుకు చంద్రయ్య అడవిబాట పట్టారు. తల్లిదండ్రులు చిన్న కొడుకు తలంపులోనే అనారోగ్యంతో మరణించారు. మరో సొదరుడు శంకరయ్య అనారోగ్యంతో పదేళ్ల కిందట మరణించాడు. తల్లిదండ్రులు మరణించినా, సొదరుడు మరణించినా చంద్రయ్య ఇంటి ముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదినే దేవవ్వ ధర్మారంలో ఉంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement