
ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్ అడవుల్లో ఎన్‌కౌంటర్
ఒకేరోజు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యుల మృతి
మృతుల్లో కడారి సత్యనారాయణరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి
ఈ ఏడాది ఇప్పటి వరకు కేంద్ర కమిటీ సభ్యులు తొమ్మిది మంది హతం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, సిద్దిపేట/సిరిసిల్ల: ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్ర సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవుల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి (67) అలియాస్ కోసా, కట్టా రామచంద్రారెడ్డి (63) అలియాస్ వికల్ప్ మృతి చెందారు. ఈ ఘటనపై నారాయణపూర్ ఎస్పీ రాబిన్‌సన్ గుడియా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో మహారాష్ట్రకు సమీప సరిహద్దులో ముస్‌ఫర్షి దగ్గరున్న దట్టమైన అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారం శుక్రవారమే పోలీసులకు అందిందని, దీంతో భద్రతాదళాలు మావోలు తలదాచుకున్న ప్రదేశాన్ని రెండు వైపుల నుంచి చుట్టుముడుతూ ముందుకు వెళ్లాయన్నారు.
సోమవారం ఉదయం ఇరువర్గాల మధ్య కాల్పులు జరగ్గా, కడారి సత్యనారాయణరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి చనిపోయినట్టుగా గుర్తించామని వివరించారు. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47, ఒక ఇన్సాస్, ఒక బీఎల్‌జీ, పేలుడు పదార్థాలతోపాటు మావోయిస్టుల వ్యక్తిగత సామగ్రి, విప్లవ సాహిత్యం స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వాన్ని పద్ధతి ప్రకారం భద్రతా దళాలు తుదముట్టిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రెడ్ టెర్రర్‌కు రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు.
ఇద్దరూ ఇద్దరే..
21వ ఆవిర్భావ వేడుకలు మొదలైన రెండో రోజే మావోయిస్టు పార్టీ ఇద్దరు అగ్రనేతలను కోల్పోయింది. అందులో ఒకరైన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లె. సత్యనారాయణరెడ్డి తండ్రి కిష్టారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అన్నమ్మ గృహిణి. సోదరుడు కరుణాకర్‌రెడ్డి రిటైర్డ్ ఎంఈవో. 1980 దశకంలో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో చేరిన సత్యనారాయణరెడ్డి 45 ఏళ్లుగా ఇంటి ముఖం చూడలేదు. ఆయన తండ్రి కిష్టారెడ్డి 2013 జూన్ 8న మరణించాడు.
తల్లి అన్నమ్మ 2012 నవంబర్ 14న గోపాల్‌రావుపల్లెలో అనారోగ్యంతో మృతిచెందారు. సత్యనారాయణరెడ్డి సిరిసిల్లలో ప్రాథమికవిద్య అభ్యసించి పెద్దపల్లి ఐటీఐలో చదువుకున్నారు. అక్కడే బసంత్‌నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరిన సత్యనారాయణరెడ్డి కార్మీకుల హక్కుల కోసం ఉద్యమించారు. ఈ క్రమంలో సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ హత్యకు గురికాగా.. ఆ కేసులో సత్యనారాయణరెడ్డి జైలుకు వెళ్లాడు.
జైలు నుంచి వచ్చాక అప్పటి సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస)లో చురుకైన నాయకుడిగా పనిచేస్తూ పీపుల్స్‌వార్‌లో చేరారు. చనిపోయే వరకూ కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో సెంట్రల్ రీజినల్ బ్యూరో ఇన్‌చార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. పార్టీ వ్యూహకర్తల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. దండకారణ్యంలో విప్లవ పోరాటానికి పునాదులు వేసిన వారిలో సత్యనారాయణరెడ్డి ఒకరు. అతని తలపై మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.3 కోట్ల రివార్డును ప్రకటించాయి.
కట్టా రామచంద్రారెడ్డి :
మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజుదాదా, అలియాస్ వికల్ప్‌కు గుడ్సా ఉసెండీ అనే పేరు కూడా ఉంది. ఈ పేరుతో అనేక దాడుల్లో ఆయన పాల్గొన్నారు. పీపుల్స్‌వార్ పార్టీకి సంబంధించి ఆర్‌కే పేరు ఎంత పాపులరో, ఛత్తీసగఢ్‌లో గుడ్సా ఉసెండీ అనే పేరుకు అంత ప్రాముఖ్యత ఉంది. ఛత్తీస్‌గఢ్ నుంచి హిడ్మా నూతన నేతగా ఎదిగే వరకు దళాల్లోకి కొత్తగా వచ్చిన సభ్యులు గుడ్సా ఉసెండీ పేరు పెట్టుకునేందుకే ఆసక్తి చూపించేవారు. పదవ తరగగతి వరకు కోహెడలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు.
టీటీసీ పూర్తి అయిన తర్వాత కరీంనగర్ జిల్లా కాటారం మండలం పెంచికలపేట గ్రామంలో ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ ప్రాంతంలో పీపుల్స్‌వార్ ప్రభావం ఎక్కువగా ఉండేది. తర్వాత బదిలీపై కోహెడ మండలం వరికొలుకు వచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుయ్యాడు. అప్పటికే శాంతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి ఎల్‌ఎల్‌బీ చేసేందుకు ఔరంగబాద్‌కు వెళ్లాడు.
అక్కడి నుంచే 1989 సంవత్సరంలో భార్య శాంతితో కలసి పీపుల్స్‌వార్‌లో చేరేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 12 సంవత్సరాల క్రితం రాయ్‌పూర్‌లో భార్య శాంతి, పిల్లలతో సహా లోంగిపోయారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మూడున్నర దశాబ్ధాలుగా పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో రామచంద్రారెడ్డి పని చేశారు. ఇతనిపై 40 లక్షల రివార్డు ఉంది. కూతురి వివాహానికి సైతం రాలేదు.
డీజీపీ చెప్పినట్టుగానే..
మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాళ కేశవరావు ఎన్‌కౌంటర్ 2025 మే 21న జరిగింది. ఈ సమయంలో ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్ మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీలో అగ్రనేతలంతా తమ రాడార్‌లో ఉన్నారని, సరైన సమయం వచ్చినప్పుడు ఆపరేషన్లు చేపడుతున్నామని, అలాంటి ఓ ఆపరేషన్‌లో నంబాల ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే గత మే నుంచి వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు చనిపోతున్నారు.
– జూన్‌లో తెంటు లక్ష్మీనరసింహాచలం అలియాస్ సుధాకర్, జూలైలో గాజర్ల ఉదయ్ అలియాస్ గణేశ్ చనిపోయారు.
– సెప్టెంబరులో అయితే కోలుకోలేని దెబ్బ పడింది. ఒకే నెలలో మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్, పర్వేశ్ అలియాస్ సహదేవ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి మొత్తం నలుగురు చనిపోయారు.
– అంతకుముందు ఏప్రిల్‌లో ప్రయాగ్‌మాంఝీ, జనవరిలో చలపతి మరణించారు.
– మరో కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత లొంగిపోగా, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ పార్టీ లైన్‌తో విభేదించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.