
సిరిసిల్ల యువకుడి విషాదాంతం
వినాయక విగ్రహం తెస్తూ విద్యుదాఘాతంతో మృతి
సిరిసిల్లటౌన్: పుట్టినరోజున ఇంట్లో అమ్మ ఆశీస్సులు పొంది, దోస్తులతో ఆనందంగా గడుపొచ్చన్న యువకుడిని విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబళిచింది. స్థానికులు తెలిపిన వివరాలు..తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్‌కు చెందిన కొమ్ము మైసయ్య–నవీన దంపతులు సిరిసిల్ల నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్నారు. మైసయ్య ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉండగా..భార్య నవీన ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. వీరికి లక్ష్మీనారాయణ ఉరఫ్ లక్కీ(20), నిఖిల్, శ్వేత సంతానం. కొద్దిరోజులు హైదరాబాద్‌లో పనిచేసిన లక్ష్మీనారాయణ ఇటీవలే సిరిసిల్లకు వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు గణేశ్ ప్రతిమను తీసుకురావడానికి లక్ష్మీనారాయణ సోమవారం ఫ్రెండ్స్‌తో ఆర్మూర్ వెళ్లాడు.
పుట్టినరోజే కానరాని లోకాలకు..
మంగళవారం తన పుట్టినరోజు కావడంతో దోస్తులతో కలిసి అప్పటికే ఆర్డర్ ఇచ్చిన 15 అడుగుల వినాయక ప్రతిమను తీసుకొచ్చి వేడుకలు జరుపుకోవాలని లక్కీ, ఫ్రెండ్స్ నిశ్చయించుకున్నారు. సోమవారం రాత్రి వర్షంలో ఇబ్బందులు ఎందుకని ఫ్రెండ్స్ అందరూ ఆర్మూర్‌లోనే పడుకున్నారు. మంగళవారం ఉదయం సిరిసిల్లకు వినాయక విగ్రహంతో ప్రయాణమయ్యారు. కామారెడ్డి జిల్లా ఆరెపల్లి గ్రామ స్టేజీ వద్ద హైటెన్షన్ కరెంటు తీగలకు గణపతి విగ్రహానికి అమర్చిన ఇనుప పైపులు తగిలి లక్ష్మీనారాయణ, సాయి అనే ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే షాక్‌తో పడిపోయారు.
స్నేహితులు, స్థానికులు వెంటనే వారికి సీపీఆర్ చేయగా, సాయి మెలకువలోకి రాగా, లక్ష్మీనారాయణ అలానే పడిపోయాడు. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మరో గంట సమయం గడిస్తే సిరిసిల్లకు చేరేవారు. కాగా, లక్కీ, సాయిలకు కాళ్లకు చెప్పులు లేకపోవడంతో షాకు తగిలినట్లు ఫ్రెండ్స్ చర్చించుకుంటున్నారు. పుట్టినరోజునే లక్కి జీవితం విషాదాంతంగా ముగియడం సిరిసిల్లలో తీరని విషాదం నింపింది.