ఆర్టీఏ లేడీస్‌ స్పెషల్‌

ఆర్టీఏ లేడీస్‌ స్పెషల్‌ - Sakshi


ఈ నెల 8న మహిళా డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళా

గత నెలలో లెర్నింగ్‌ తీసుకున్నవాళ్లకు డ్రైవింగ్‌ పరీక్షలు

సుమారు 600 మంది మహిళలకు ప్రత్యేకంగా స్లాట్‌లు




సిటీబ్యూరో: రవాణాశాఖ మరోసారి లేడీస్‌ స్పెషల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళాకు శ్రీకారం చుట్టింది. గత నెల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లెర్నింగ్‌ లైసెన్సులు తీసుకున్న మహిళలకు ఈ నెల 8వ తేదీన నాగోల్‌  డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో పరీక్షలు నిర్వహించి డ్రైవింగ్‌ లైసెన్సులు అందజేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం మహిళలకు మాత్రమే 8వ తేదీన స్లాట్‌లు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు. ఆ రోజు సుమారు 600 మంది డ్రైవింగ్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు ఆర్టీఏ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా మహిళా మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌ పాండురంగ్‌ నాయక్‌ తెలిపారు.



సాధారణంగా చాలా మంది మహిళలకు డ్రైవింగ్‌ తెలిసినప్పటికీ లైసెన్సులు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ప్రతిరోజు గ్రేటర్‌లో  సుమారు 1500 నుంచి 2000 మంది డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరవుతుండగా వారిలో మహిళలు కనీసం 25 శాతం కూడా ఉండడం లేదు. ఉద్యోగరీత్యా తీరిక లేకపోవడం వల్ల, ఇతరత్రా కారణాల వల్ల మహిళలు డ్రైవింగ్‌ పరీక్షలకు హాజరుకావడం లేదు. మార్కెటింగ్‌ రంగంలో, ఐటీ రంగంలో, వ్యాపారంలోనే కాకుండా వివిధ రంగాల్లో కీలకమైన విధులు నిర్వహిస్తున్న చాలా మంది మహిళలు డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోవడంలో తీరికలేమి కారణంగా సరైన శ్రద్ధ చూపడం లేదు.



మరోవైపు చాలా మంది గృహిణులు పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లేందుకు, తిరిగి ఇళ్లకు తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనాలు, కార్లు వినియోగిస్తున్నప్పటికీ తప్పనిసరిగా  లైసెన్సు  తీసుకోవాలనే అంశాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మహిళల్లో  డ్రైవింగ్‌ పట్ల అభిరుచిని పెంచే లక్ష్యంతో ఆర్టీఏ గత నెలలో  ‘లేడీస్‌ స్పెషల్‌ మేళా’ చేపట్టింది. ఈ మేళాకు అనూహ్యమైన స్పందన లభించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 550 మంది మహిళలు లెర్నింగ్‌ లైసెన్సులు తీసుకున్నారు.



ప్రస్తుతం డ్రైవింగ్‌ లైసెన్సులు...

సాధారణంగా ఒకసారి లెర్నింగ్‌ లైసెన్సు తీసుకున్న వారు 30 రోజుల్లో ఆర్టీఏ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లలో నిర్వహించే  డ్రైవింగ్‌ పరీక్షలకు తమ వాహనాలతో హాజరై  వాహనాలను నడపాలి. నెలరోజుల్లో  డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోలేని వారికి 6 నెలల వరకు కూడా అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది గడువు ముగిసినా కూడా  డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షలకు హాజరుకాకపోవడం వల్ల  లెర్నింగ్‌ దశలోనే ఉండిపోతున్నారు. గత నెలలో  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు లెర్నింగ్‌ లైసెన్సులు  అందజేసిన  అధికారులు  ప్రస్తుతం వారందరికీ శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సులు  అందజేయాలనే  లక్ష్యంతో  ఈ  కార్యక్రమాన్ని చేపట్టారు. గత నెలలో లెర్నింగ్‌ లైసెన్సులు తీసుకొన్నవాళ్లే కాకుండా గడిచిన 6 నెలల వ్యవధిలో తీసుకున్న మహిళలు కూడా ఈ నెల 8వ తేదీన స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. పరీక్షలకు హాజరయ్యేందుకు సొంత వాహనాలు ఉన్న వారు తమ వెంట తెచ్చుకోవలసి ఉంటుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top