
యూబీ బీర్ల కంపెనీ రవాణా కాంట్రాక్ట్‌ల కోసం కూటమి ఎమ్మెల్యే బెదిరింపులు?
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో కంపెనీ గేట్ వద్ద ఆయన అనుచరుల దౌర్జన్యం
రవాణా కాంట్రాక్ట్ వదిలేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి
కంపెనీలోకి లారీలు వెళ్లకుండా అడ్డుకుని హెచ్చరికలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రణస్థలంలో ఉన్న యూబీ బీర్ల కంపెనీ కాంట్రాక్టులపై అధికార కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే కన్ను పడింది. బీర్ల రవాణా కాంట్రాక్ట్‌లు అన్నీ తనకే ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కాదంటే కంపెనీ నుంచి లారీలు వెళ్లవంటూ బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో బయట ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు బయటకు చెప్పుకోలేక... నష్టాలు భరించలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.
అన్ని డిపోల కాంట్రాక్టులు కావాలంటూ..
రణస్థలంలోని యూబీ కంపెనీ నుంచి 29 డిపోలకు బీర్లు రవాణా అవుతుంటాయి. వీటిలో ఏడు డిపోలకు రవాణా కాంట్రాక్టును ఇప్పటికే ఒక ప్రజాప్రతినిధి తీసుకున్నారు. మిగతా 22 డిపోలకు బీర్ల రవాణా కాంట్రాక్టును నలుగురు కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు దక్కించుకున్నారు. ఇప్పుడా 22 డిపోల రవాణా కాంట్రాక్ట్ కూడా తనకు వదిలేయాలని ఓ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు నలుగురు కాంట్రాక్టర్లను నేరుగా అడిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వారు అంగీకరించకపోవడంతో సదరు ఎమ్మెల్యే తన అనుచరులను రంగంలోకి దించినట్లు సమాచారం. దీంతో, రవాణా కోసం వచ్చే లారీలను కంపెనీ గేటు వద్ద వారు అడ్డుకుంటున్నారు. తమ ఎమ్మెల్యే చెప్పినట్లు చేసేవరకు లారీలను లోపలికి పంపించబోమని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రవాణా కోసం వచ్చే లారీలు రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయి. డ్రైవర్లు, సిబ్బంది పడిగాపులు పడుతున్నారు. కొద్దిరోజులుగా కంపెనీ నుంచి డిపోలకు సరుకు వెళ్లడం లేదని సమాచారం. మరోవైపు లారీల కిరాయి భారం కాంట్రాక్టర్లపై పడుతోంది.
సమస్య పరిష్కారానికి కంపెనీ ప్రతినిధులు ప్రయతి్నంచినా...
సమస్యను పరిష్కరించేందుకు యూబీ పరిశ్రమ హెడ్ ఆఫీస్ నుంచి రెండు రోజుల కిందట ఇద్దరు ప్రతినిధులు వచ్చినా ఫలితం లేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యకు యూబీ రణస్థలం పరిశ్రమలో ఉన్న ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమర్షియల్ విభాగంలోని ఒక ముఖ్య అధికారి ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలో జరిగేదంతా ఆయన ఎప్పటికప్పుడు సదరు ఎమ్మెల్యేకు చేరవేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఏ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌కు ఎంత లాభం వస్తుందనే వివరాలను ఆయన చెప్పడం వల్లే కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే గట్టిగా పట్టుపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూబీ పరిశ్రమలో కొంతమంది ఉద్యోగులు కూడా ఎమ్మెల్యే అడుగులకు మడుగులొత్తడం వల్ల కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా చక్కదిద్దకపోతే పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోందనే చర్చ సాగుతోంది.