
నగరంలో భారీ వర్షం..
ఉపరితల ఆవర్తనం కారణంగా శుక్రవారం హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగా లులతో కూడిన భారీ వర్షం కురిసింది.
- ఈదురుగాలులు, ఉరుములతో కురిసిన వాన
- పలు ప్రాంతాల్లో రోడ్లపైకి చేరిన వరద నీరు.. స్తంభించిన ట్రాఫిక్
- కూలిన చెట్లు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం
- నేడు కూడా వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం కారణంగా శుక్రవారం హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగా లులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, కొత్తపేట, చైతన్యపురి, ఉప్పల్, రామంతాపూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, చం పాపేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రహ దారులపై వరద నీరు పోటెత్తింది. ట్రాఫిక్ ఎక్కడి కక్కడే స్తంభించింది. ఈదురుగాలుల బీభత్సానికి పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చంచల్‌గూడ, ఉస్మాన్‌ఘడ్, మలక్‌పేట, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 50 ఫీడర్ల పరిధిలో గంటన్నర పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సీపీడీసీఎల్ వర్గాలు తెలిపాయి.
నేడు కూడా వర్షసూచన
ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం హైదరాబాద్‌లో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.