రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం తెలంగాణ, ఏపీ వాణిజ్య పారిశ్రామిక మండలి(ఎఫ్టీఏపీసీసీఐ) శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు.
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం తెలంగాణ, ఏపీ వాణిజ్య పారిశ్రామిక మండలి(ఎఫ్టీఏపీసీసీఐ) శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి మార్గంలో పయనిస్తుందన్నారు. గత 15 సంవత్సరాల అభివృద్ధిలో భారత్ యొక్క బలమైన పునాదులతో పాటు.. బాహ్యకారకాలు దోహదపడ్డాయని అన్నారు. భారత్ కొన్ని దిద్దుబాటు చర్యలను సరైన సమయంలో చేపట్టిందన్నారు. సంక్షోభ సమయంలో సైతం భారత్ వృద్ధివైపు పయనించిందని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు సమ్మిళిత వృద్ధికి తోడ్పడుతున్నాయని ప్రణబ్ పేర్కొన్నారు. ఎఫ్‌టీఏపీసీసీఐ ప్రెసిడెంట్ రవినియ మోదీ మాట్లాడుతూ.. ఏ సంస్థకైనా 100 సంవత్సరాల ప్రయాణం అనేది సుదీర్ఘమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.