పోస్టల్‌శాఖలో ‘పార్శిల్’ మాఫియా! | Sakshi
Sakshi News home page

పోస్టల్‌శాఖలో ‘పార్శిల్’ మాఫియా!

Published Sun, Jul 3 2016 11:53 PM

పోస్టల్‌శాఖలో ‘పార్శిల్’ మాఫియా! - Sakshi

డమ్మీ కొరియర్లతో  సిబ్బంది ఒప్పందం
ఎన్‌ఓసీ, డిక్లరేషన్ లేకుండానే  ‘మందుల’ రవాణా
కొరియర్ సర్వీసులదీ  అదే దారి..
‘సాక్షి’ పరిశీలనలో  వెలుగులోకి వాస్తవాలు

 
 
ఓ వస్తువును దూర ప్రాంతానికి చేరవేయాలంటే పోస్టులో  పంపేస్తాం. త్వరగా వెళ్లాలంటే కొరియర్ చేస్తాం. పంపే వస్తువును బట్టి పోస్టల్ శాఖ ధర, కొన్ని నిబంధనలు విధించింది. ఇప్పుడు ఈ ‘నిబంధన’లనేఅడ్డుపెట్టుకుని కొందరు పోస్టల్ శాఖ ఉద్యోగులు అడ్డదారిలో సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని డమ్మీ కొరియర్ సంస్థలతో చేతులు కలిపి.. ‘మందులు’ పంపేందుకు సొంత శాఖ నిబంధనలకు తూట్లు పొడిచి జేబులు నింపుకుంటున్నారు.
 

సిటీబ్యూరో: సిటీ నుంచి ఔషధాలను విదేశాలకు పోస్టులో పంపాలంటే పోస్టల్ శాఖ కొన్ని నిబంధనలు పాటిస్తోంది. వైద్యుడు రాసిచ్చిన మందుల చీటీ, ఔషధాలు ఖరీదు చేసిన బిల్లుతో పాటు ఔషధ నియంత్రణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తప్పనిసరి చేసింది. మందులు పంపేవారికి ఇవన్నీ పాటించడం కొంత కష్టంగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకున్న పోస్టల్ శాఖ ఉద్యోగులు కొన్ని డమ్మీ కొరియర్ సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండానే ఔషధాల పార్శిల్స్‌ను యథేచ్ఛగా విదేశాలకు పంపేస్తున్నారు. ఇందుకోసం వీరు పోస్టల్ శాఖ కంటే రెట్టింపు డబ్బు వసూలు చేస్తూ ‘కొరియర్ నిర్వాహకులతో’ కలిసి పంచుకుంటున్నారు. మరోపక్క ఔషధాల రవాణాకు సంబంధించి ప్రైవేట్ కొరియర్ సంస్థలు మరో దందాకు తెరలేపాయి. ఇవన్నీ వెరసి ఔషధాలు పంపే వ్యక్తికి ఆర్థిక భారం, నిబంధనలకు తూట్లు తప్పట్లేదు. ఈ ‘డ్రగ్ పార్శిల్ మాఫియా’పై ‘సాక్షి’ చేసిన పరిశీలనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
 
అక్కడ ‘వైద్యం’ చాలా ఖరీదు..
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన వేల మంది ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్నారు. అమెరికా సహా మరికొన్ని దేశాల్లో వైద్యం అత్యంత ఖరీదైన అంశం. అమెరికానే తీసుకుంటే.. మనదేశంలో మాదిరిగా చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు నేరుగా ఫార్మసీకి వెళ్లి ఔషధాలు ఖరీదు చేసుకోవడం సాధ్యం కాదు. వైద్యుడు  రాసిచ్చిన మందుల చీటీ ఉంటే తప్ప వీటిని విక్రయిం చరు. ఆ దేశంలో సాధారణ డాక్టర్‌ను సంప్రదిస్తే కనీసం 350 డాలర్లు, ఎండీ స్థాయి వైద్యుడి దగ్గరకు వెళితే 500 డాలర్లు చెల్లించాలి. ఈ కన్సల్టేషన్‌కు తోడు ఆయా వైద్యులు పూర్తి పరీక్షలు చేస్తే తప్ప మందులు రాయరు. దీంతో భారీ మొత్తం వెచ్చించాల్సిందే. ఇంతా చేసినా అక్కడ లభించే ఔషధాలు సైతం అత్యం త ఖరీదుతో కూడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ తమలో అనేక మంది ఇండియాలోని వైద్యులను సంప్రదించి, ఔషధాలను సైతం పార్శిల్‌లో తెప్పించుకుంటామని ప్రవాస భారతీయులు చెబుతున్నారు.
 

తాజాగా మారిన నిబంధనలు..
 నగరంలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు అవసరమైన ఔషధాలను పార్శిల్ చేయడానికి వారి బంధువులు ప్రాథమికంగా పోస్టాఫీసులనే సంప్రదిస్తుం టారు. ప్రధానంగా అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీస్‌కు (జీపీఓ) వీరి తాకిడి ఎక్కువగా ఉంటోంది. అక్కడి అధికారులు ఈ పార్శిల్స్‌ను నేరుగా తీసుకోవడానికి లేదు. పోస్టల్ ద్వారా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే పార్శిల్స్ అన్నీ ముంబైలోని ప్రధాన పోస్టల్ కార్యాలయం ద్వారానే వెళ్తుంటాయి. ఇటీవల ముంబైలోని ఆ కార్యాలయం నుంచి పోస్టల్ అధికారులు ఓ సర్క్యులర్ వచ్చింది. దీని ప్రకారం...
     

{దవ రూపంలో ఉండే టానిక్స్, ఆయింట్‌మెం ట్స్‌ను పార్శిల్ చేయడానికి అంగీకరించకూడదు. మాత్రలు (పిల్స్) సైతం ఒక్క డోస్ మాత్రమే పంపాలి.   సదరు ఔషధంతో పాటు వైద్యుడు రాసిచ్చిన మందుల చీటీ, ఔషధాలు ఖరీదు చేసిన బిల్లు, ఔషధ నియంత్రణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకువచ్చి జీపీఓ అధికారులకు చూపించాలి  ఆపై పార్శిల్ చేస్తున్న వ్యక్తి తన గుర్తింపు పత్రాలతో పాటు డిక్లరేషన్ ఇవ్వాలి.


పోస్టల్ పార్శిల్ ఓ నరకం..
ఈ నిబంధనలు పార్శిల్స్ చేసే వ్యక్తులకు ‘బంధనాలు’గా మారుతున్నాయి. ప్రచారం లేని కారణంగా వీటి విషయం తెలియక  ఔషధాలను (పిల్స్ సైతం) పక్కాగా పార్శిల్ చేసి జీపీఓను సంప్రదిస్తే వాటిని పం పేందుకు అంగీకరించడం లేదు. తాజా మార్పుల ప్రకారం అవసరమైన పత్రాలు తీసుకురమ్మంటూ చెప్తున్న అధికారులు.. ముందే పార్శిల్ చేసి తీసుకువస్తే కుదరదని, తాము చూసిన తర్వాత పార్శిల్‌కు సీల్ వేయాలని స్పష్టం చేస్తున్నారు. నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కోసం ఆయుష్ విభాగాన్ని ఆశ్రయించమని సూచిస్తున్నారు. అక్కడకు వెళ్లిన వారికీ చేదు అనుభవమే ఎదురవుతోంది. తాము ఆ తరహా ఎన్‌ఓసీలు జారీ చేయట్లేదని, చట్టప్రకారం తమకు ఆ అధికారం లేదని చెప్పి, డ్రగ్ కంట్రోల్ విభాగాన్ని సంప్రదించమని సూచిస్తున్నారు. ఔషధాలు విదేశాలకు పంపడమనేది అత్యవసర అంశం కావడంతో వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ‘పక్కదారులు’ వెదుకుతున్నారు.
 

ఏ పత్రం లేకుండానే పార్శిల్..
 సరిగ్గా ఇదే సమయంలో జీపీఓ చుట్టూ ఉండే ‘డమ్మీ కొరియర్’ నిర్వాహకులు తెరపైకి వస్తున్నారు. తమకు పోస్టల్ శాఖకు చెందిన ఉద్యోగులతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఔషధాలు పార్శిల్ చేయడానికి ఎలాంటి పత్రాలు అవసరంలేదని, కోరినంత ఇస్తే టానిక్స్, ఆయింట్‌మెంట్స్‌ను విదేశాలకు పార్శిల్ చేస్తామంటున్నారు. ఇందుకు అవసరమైన స్టాంపులన్నీ పోస్టల్ ఉద్యోగులే వేస్తారని హామీ కూడా ఇస్తున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు ‘సాక్షి’ కొన్ని ఔషధాల్ని అమెరికాకు పార్శిల్ చేసింది. జూన్ మొదటి వారంలో డమ్మీ కొరియర్ సంస్థ నిర్వాహకులు పార్శిల్‌ను అంగీకరిస్తూ రూ.1250 వసూలు చేసి రసీదు ఇచ్చారు. ఎన్‌ఓసీ, డిక్లరేషన్ సహా ఏ పత్రాన్నీ కోరలేదు. ఈ పార్శిల్‌ను సదరు ‘డమ్మీ కొరియర్’ నిర్వాహకుడు జూబ్లీహిల్స్‌లోని పోస్టల్ ప్రధాన కార్యాలయం నుంచి విదేశాలకు పంపేశాడు. ఆ పార్శిల్ వివరాలకు ట్రాక్ చేసుకోవచ్చంటూ దానికి సంబంధించిన నెంబర్‌ను సైతం ‘సాక్షి’కి అందించాడు. ‘ఇండియా పోస్ట్’ వెబ్‌సైట్ ద్వారా ఈ నెంబర్‌ను ట్రాక్ చేస్తే సదరు ఔషధాల పార్శిల్ జూబ్లీహిల్స్ నుంచి ముంబై మీదుగా అమెరికా చేరినట్లు స్పష్టమైంది. పోస్టల్ శాఖ రికార్డుల ప్రకారం దీని ధర (టారిఫ్) రూ.670గా ఉంది. మిగిలిన రూ.580 పోస్టల్ ఉద్యోగులు, డమ్మీ కొరియర్ నిర్వాహకులు పంచుకుంటున్నారని స్పష్టమైంది. ఒక్క హైదరాబాద్ నుంచే ఈ విధంగా రోజూ వందల పార్శిల్స్ వెళ్తుండటంతో ఆయా సిబ్బంది అక్రమార్జన రోజుకు రూ.వేలల్లోనే ఉంటోందని తెలుస్తోంది.
 


ప్రముఖ సంస్థలది మరోదారి..
 తాజాగా అమలులోకి వచ్చిన పోస్టల్ నిబంధనలను ఆసరాగా చేసుకుంటున్న ప్రముఖ కొరియర్ సంస్థలూ అడ్డదారి తొక్కుతున్నాయి. డమ్మీ కొరియర్ ద్వారా పోస్ట్‌లో పార్శిల్ పంపిన ‘సాక్షి’.. ఈ విషయంపై కొన్ని ప్రముఖ కొరియర్ సంస్థలను సంప్రదించింది. తొలుత ఔషధాల పార్శిల్స్ సేకరించమని చెప్పిన ఆయా నిర్వాహకులు.. కార్యాలయాలకు వచ్చి కలవాల్సిందిగా కోరుతున్నారు. అలా వెళ్తే 250 గ్రాముల కంటే తక్కువ బరువు ఉండే పార్శిల్‌ను అమెరికాకు పంపడానికి రూ.2100 ఖర్చవుతుందని చెప్తున్నారు. ఔషధాలు పంపేందుకు నిబంధనలు అంగీకరించవని, అయినప్పటికీ తాము రిస్క్ తీసుకుని పంపిస్తామని హామీ ఇస్తున్నారు. దీని నిమిత్తం అదనంగా రూ.750 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ రకంగా అమలులో ఉన్న నిబంధనలకు తూట్లు పొడుస్తున్న కొరియర్ నిర్వాహకులు, పోస్టల్ శాఖ ఉద్యోగులు అవసరంలో ఉన్న వారిని అడ్డంగా దోచుకుంటున్నారు. నిబంధనల్ని సరళీకరించి, వాటిపై ప్రచారం కల్పిస్తే వినియోగదారులు ‘పక్క దారులు’ పట్టాల్సిన అవసరమే ఉండదు. సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టిపెట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
 
 

Advertisement
 
Advertisement