పోలీస్‌ నియామకాలకు నిధుల కొరత! | Police recruitment to shortage of funds! | Sakshi
Sakshi News home page

పోలీస్‌ నియామకాలకు నిధుల కొరత!

Feb 16 2017 4:05 AM | Updated on Oct 2 2018 4:36 PM

పోలీస్‌ నియామకాలకు నిధుల కొరత! - Sakshi

పోలీస్‌ నియామకాలకు నిధుల కొరత!

రాష్ట్రంలో పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి నిధుల కొరత అడ్డంకిగా మారింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భారీ స్థాయిలో

పోలీస్‌ పరీక్ష ఫలితాల ఆలస్యానికి నిధుల కొరతే కారణం
శిక్షణలో ఉన్నవారికి స్టైఫండ్‌ పెంచాలన్న పోలీస్‌ శాఖ
ఖజానాలో నిధుల్లేవన్న ఆర్థిక శాఖ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి నిధుల కొరత అడ్డంకిగా మారింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భారీ స్థాయిలో నియామకాలకు పోలీస్‌ శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. గతేడాది ప్రారంభమైన ఈ ప్రక్రియలో తుది ఫలితాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే ఫలితాల వెల్లడిపై పెద్ద నోట్ల రద్దు, ఖజానాలో నిధులలేమి ప్రభావం పడినట్టు కనిపిస్తోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలోనే పోలీస్‌ అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వ ఖజానాలో నిధుల్లేకపోవడంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలోనే శిక్షణ ప్రారంభించాలని ప్రభుత్వం పోలీస్‌ శాఖకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ కారణం వల్లే జనవరిలో వెలువడాల్సిన పోలీస్‌ పరీక్ష ఫలితాలు ఆలస్యమవుతున్నట్లు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. ఫలితాలు ఎప్పుడు వెలువడుతాయో తెలియక అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. నిత్యం 150 నుంచి 200 మంది పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులకు ఫోన్లుచేసి ఫలితాలపై ఆరాతీస్తున్నారు.

స్టైఫండ్‌ పెంచలేం...
కాగా, ఇప్పటికే శిక్షణలో ఉన్న పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలకు చాలీచాలని స్టెఫండ్‌ ఇస్తున్నామని, దీన్ని పెంచాలని పోలీస్‌ ఉన్నతాధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న కానిస్టేబుల్‌కు రూ.4వేలు స్టెఫండ్‌  చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.9వేలకు పెంచాలని పోలీస్‌ శాఖ ప్రతిపాదించింది. అదే విధంగా సబ్‌ఇన్‌స్పెక్టర్లకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.9వేల స్టైఫండ్‌ను రూ.15 వేలకు పెంచాలని కోరింది. అయితే రాష్ట్ర ఖాజానాలో నిధుల్లేవని, ఇంత మొత్తంలో స్టెఫండ్‌ పెంచడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ఆర్థిక శాఖ ఆ ఫైలును తిప్పిపంపినట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో శిక్షణ సమయం నుంచే జీతభత్యాలు చెల్లిస్తుండగా,  ఇక్కడ కనీసం స్టెఫండ్‌ అయినా పెంచాలని తాము కోరామని, కానీ ఆ ప్రతిపాదనను ఆర్థిక శాఖ పక్కనబెట్టడం ఇబ్బందిగా మారిందని అధికారులు స్పష్టంచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement