రూ.200 కోట్లతో ‘నిమ్స్‌’ టవర్లు | Sakshi
Sakshi News home page

రూ.200 కోట్లతో ‘నిమ్స్‌’ టవర్లు

Published Mon, Jun 12 2017 3:20 AM

'Nims' towers with Rs. 200 crore

సాక్షి, హైదరాబాద్‌: నిమ్స్‌ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతుండటంతో అవసరాలకు తగినట్లుగా రెండు మెడికల్‌ టవర్లు నిర్మించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. వాటిలో ఒకటి కిడ్నీ వ్యాధుల చికిత్సలు, మరోటి ఔట్‌పేషెంట్‌ (ఓపీ) కోసం నిర్మించనున్నారు. టవర్ల నిర్మాణానికి ఆంధ్రాబ్యాంకు నుంచి రూ. 200 కోట్లు రుణం తీసుకోనున్నామని, ఆ మొత్తానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలి పాయి. కిడ్నీ టవర్‌కు రూ.120 కోట్లు, ఓపీ టవర్‌కు రూ.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. నిమ్స్‌లోని ఖాళీ స్థలాల్లో ముందుగా కిడ్నీ, ఓపీ టవర్లు, మున్ముందు గుండె టవర్‌ నిర్మించనున్నారు. రాష్ట్రంలో కేన్సర్‌కు ఎంఎన్‌జే ఆస్పత్రి, కంటి చికిత్సలకు సరోజినీ ఆస్పత్రి, ఛాతీ వైద్యం కోసం ఛాతీ వైద్యశాల, ప్రసవాలకు పేట్ల బురుజు ఆస్పత్రి ఉన్నాయి. కిడ్నీ, గుండె వ్యాధులకు ప్రత్యేక ఆస్పత్రులు లేకపోవడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, జర్నలిస్టులకు నగదు రహిత ఆరోగ్య పథకం అమలు చేస్తుండటం.. సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ రోగులూ ఇక్కడికే తరలి వస్తుండటంతో విస్తరణ తప్పనిసరైంది.
 
గతేడాది 54,821 కిడ్నీ చికిత్సలు.. 
201617లో ఆరోగ్యశ్రీ ద్వారా 2.80 లక్షల మందికి పలు రకాల చికిత్సలందించగా.. అందుకు ప్రభుత్వం రూ.748 కోట్లు ఖర్చు చేసింది. వాటిలో 54,821 కిడ్నీ వైద్య చికిత్సలు జరగగా.. 77.55 కోట్లు సర్కారు ఖర్చు చేసింది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధుల కేసులు ఏడాదికి 1015 శాతం పెరగడంతో నిమ్స్‌కు కిడ్నీ కేసులు ఏడాదికి 30 శాతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 500 పడకలతో కిడ్నీ టవర్‌ నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. డయాలసిస్‌ యూనిట్లు, కిడ్నీ మార్పిడి థియేటర్లు, పేయింగ్‌ రూము లను టవర్‌లో ఏర్పాటు చేస్తారు. మరోవైపు  రోజూ 2 వేల మంది రోగులు ఓపీ సేవల కోసం నిమ్స్‌కు వస్తుం డటం, వైద్య పరీక్షల నిర్వహణకు మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాత బ్లాక్‌ స్థానే అధునాతన వసతులతో ఓపీ టవర్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Advertisement
Advertisement