గిరిజన రైతులను అన్ని విధాలుగా ఆదుకుని, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
సాక్షి, హైదరాబాద్: గిరిజన రైతులను అన్ని విధాలుగా ఆదుకుని, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పంట వేసుకునేందుకు ఆర్థిక సాయంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే వరకు సహకారం అందించాలని యోచిస్తోంది. ఈ పథకానికి ఎస్టీ శాఖ ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ శాఖ పరిధిలోని ట్రైకార్(ఎస్టీ సహకార ఆర్థిక కార్పొరేషన్) ద్వారా ఈ పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోం ది. రైతులు ఒక బృందంగా ఏర్పడి పంటను వేయడం మొదలుకుని, ఉత్పత్తి చేతికొచ్చాక దానిని గిడ్డంగుల్లో భద్రపరిచి మంచి ధర వచ్చినపుడు విక్రయించేలా పథకం రూపొందిస్తున్నారు. వరంగల్‌జిల్లాలో మిర్చి, ఆదిలాబాద్ జిల్లాలో సోయా, ఇలా మిగతా జిల్లాల్లో అక్కడి ప్రత్యేకతలను బట్టి ఆయా పంటలను వేయిస్తూ రైతులు ఆర్థికంగా లాభపడేలా చేయడం ఈ పథకం ఉద్దేశం.
త్వరలో వాహన పథకం...
డ్రైవింగ్‌లో అనుభవముండి, సొంతంగా వాహనాలు నడుపుకోగలిగే ఎస్టీలకు ప్యాసింజర్, రవాణా వాహనాలు అందించనున్నారు.డ్రైవర్ కమ్ ఓనర్ పథకంలో భాగంగా ఈ వాహనాలు ఇస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దీనిని ప్రారంభించి ,పదిజిల్లాల్లో వెయ్యి మందికి ఊతమివ్వనున్నారు. దీన్ని ఎస్టీ ఆర్థిక సహకార కార్పొరేషన్ (ట్రైకార్) ద్వారా అమలుచేయనున్నారు.ఈ పథకం నేరుగా లబ్ధిదారులకే చేరేలా నిబంధనలను రూపకల్పన చేస్తున్నారు.