
ఔటింగ్ కోసం ఫైటింగ్!
విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. సెలవులు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు.
మంగళవారం రాత్రి భోజనాలు ముగిసిన తరువాత అర్ధరాత్రి హాస్టల్ సిబ్బందిని సమస్యల పేరుతో ఒక గదిలోకి పిలిచి తాళం వేశారు. ఔటింగ్ ఇవ్వకపోవడమే ప్రధాన కారణంగా పేర్కొంటూ విద్యార్థులందరూ ఒక్కసారిగా విధ్వంసానికి దిగారు. ఫర్నిచర్, కుర్చీలు, బెంచీలు, కిటీకీల అద్దాలు, తలుపులు, లైట్లు ధ్వంసం చేశారు. మూడు ఫ్లోర్లలోని హాçస్టల్ గదులతో పాటు మెస్‌పైనా దాడి చేశారు. మంచినీటి ట్యాంక్‌లను సైతం ధ్వంసం చేశారు. బెంబేలెత్తిన సిబ్బంది సెల్‌ఫోన్‌ల ద్వారా పోలీసులకు, యాజమాన్యానికి సమాచారం చేరవేశారు. కేపీహెచ్‌బీ పోలీసులు హుటాహుటిన హాస్టల్ భవనం వద్దకు చేరుకున్నారు. మైక్‌లతో విద్యార్థులను పోలీసులు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా వారిపైకి రాళ్లు, అద్దం ముక్కలను విసిరివేశారు. వందల మంది విద్యార్థులు గట్టిగా నినాదాలు చేస్తూ విధ్వంసానికి పాల్పడటంతో స్థానికంగా ఉన్న కాలనీవాసులు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు పలువురు ప్రతినిధులను పోలీసులు రప్పించి విద్యార్థులకు సెలవులు ఇప్పించి ఇళ్లకు పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కొన్ని గదులలో మంటలు, పొగలు రావడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకోకుండా నీళ్లు పోసి అదుపుచేశారు. రాత్రి రెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరెడ్డి, కేపీహెచ్‌బీ సీఐ కుషాల్కర్‌లతోపాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది అక్కడే ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. హాస్టల్‌లోని పరిస్థితులు జైలును తలపించినట్లుగా ఉన్నాయని, అందుకే విద్యార్థులు తిరగబడ్డారని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. గతంలోనూ ఒకసారి ఇదే హాస్టల్‌లో విధ్వంసం జరిగినట్లు గుర్తుచేశారు.