
మంత్రులను వదిలి బ్రోకర్ల అరెస్టా?: నాగం
ఎంసెట్ లీకేజీలో అసలు దోషులైన మంత్రులను వదిలిపెట్టి బ్రోకర్లను అరెస్టు చేయడం ద్వారా కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: ఎంసెట్ లీకేజీలో అసలు దోషులైన మంత్రులను వదిలిపెట్టి బ్రోకర్లను అరెస్టు చేయడం ద్వారా కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్ లీకేజీలో మంత్రులు, ఉన్నతాధికారులకు సంబంధముందని, మంత్రులది వందశాతం బాధ్యతని ఆరోపించారు. ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన ఎంసెట్ లో వైఫల్యం చెందడంతో రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందన్నారు. ఎంతోమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలాడుకున్న మంత్రులు, అధికారులపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘పాలమూరు-రంగారెడ్డి’లో భూసేకరణ జరపకుండానే కాంట్రాక్టులు ఇచ్చారని, కాంట్రాక్టర్లకు అనుకూలంగా సర్కారు వ్యవహరిస్తోందని నాగం ఆరోపించారు.