వీణావాణిల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతాం

వీణావాణిల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతాం


- వారికి శస్త్రచికిత్స కంటే సామాజిక భద్రతే ముఖ్యం: దత్తాత్రేయ

- వీణావాణి ప్రస్తుతం చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నారు

- వైద్యుల సలహా మేరకే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని వెల్లడి

 

 సాక్షి, హైదరాబాద్ : ‘‘అవిభక్త కవలలు వీణావాణిలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారు. వారి లో శారీరకంగానే కాదు మానసికంగా కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి శస్త్రచికిత్స చేస్తే 90 శాతం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఈ అంశంలో వైద్యుల నిర్ణయమే అంతిమం..’’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తత్రేయ పేర్కొన్నారు. ప్రస్తుతం వీణావాణిలకు శస్త్రచికిత్స చేయడం కంటే సామాజిక భద్రత కల్పించడమే ముఖ్యమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తమ పిల్లలకు శస్త్రచికిత్స చేయించాలని కోరుతూ వీణావాణిల తల్లిదండ్రులు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సపై సాధ్యాసాధ్యాలను ఆరా తీసేందుకు దత్తాత్రేయ శనివారం నిలోఫర్  ఆస్పత్రికి వచ్చారు.



వీణావాణిలతో మాట్లాడారు, వారితో కాసేపు చదరంగం ఆడారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ‘‘వీణావాణిలను చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈ రోజు కుది రింది. వెల్ కం సార్.. అంటూ వారు నన్ను ఆప్యాయంగా పలకరించారు. వారి గదిలోకి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి ఇంటికి పంపిస్తాం వెళ్తారా? అని అడిగితే.. అమ్మ ఒడిలాంటి ఆస్పత్రిని వదిలి వెళ్లబోమన్నారు. వారికి చిన్నప్పుడే శస్త్రచికిత్స చేసి ఉంటే బాగుండేది. అయినా ఈ అంశాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళతాను. ప్రాణాలతో వారిని కాపాడే అవకాశముంటే తప్పకుండా శస్త్రచికిత్స చేయించేందుకు కృషి చేస్తాం. కార్మిక శాఖ తరఫున వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం..’’ అని చెప్పారు.

 

 ఆస్ట్రేలియా బృందం చికిత్స: లక్ష్మారెడ్డి

 వీణావాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన వైద్య బృందం ముందుకు వచ్చిందని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఈ చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇక నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రిలో వీణావాణిలను ఉంచడం కుదరని, వారిని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు కూడా ముందుకు రానందున స్టేట్‌హోమ్‌కు తరలించడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోందని  చెప్పారు. శనివారం ఆయన నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రితో పాటు ఎర్రగడ్డలోని ఛాతీ, మానసిక చికిత్సాలయాలను సందర్శించి... మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కలరా, ఇతర సీజనల్ వ్యాధులపై భయపడాల్సిన అవసరం లేదని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులను అప్రమత్తం చేశామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top