
ప్రభుత్వ స్థలంలో నిర్మించడంపై సర్కార్ ఆగ్రహం
సూపరింటెండెంట్ సీఎంవో, మంత్రి పేర్లు ఉపయోగించడంపై సీరియస్.. తానెలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసిన కలెక్టర్
ఎవరి ప్రయోజనాల కోసం దుకాణం అనే అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో రాత్రికి రాత్రే నిర్మించిన మందుల దుకాణాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు అధికారు లు తొలగించారు. గురువారం నాంపల్లి తహసీల్దార్, ఇతర సిబ్బంది ఆస్పత్రి భవనం ఎదురుగా నిర్మించిన దుకాణాన్ని కూల్చివేయించారు. ‘రాత్రికి రాత్రే కట్టేశారు’శీర్షికన నిలోఫర్ ఆస్పత్రి ఆవరణలో ప్రైవేట్ మందుల దుకాణ నిర్మాణంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఆరోగ్యశాఖలో చర్చనీయాంశమైంది. దీనిపై సీఎం కార్యాలయంతోపాటు మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూను వివరణ కోరినట్టు సమాచారం. నిలోఫర్ ఆస్పత్రిలో ప్రైవేటు మందుల దుకాణం ఏర్పాటుకు సంబంధించిన అంశంపై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ నరేంద్రకుమార్‌కు ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పందిస్తూ నిలోఫర్ ఆస్పత్రి క్యాంపస్‌లో నిర్మాణా లకు ఎవరికి అనుమతి ఇవ్వ లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మెడికల్ షాపు కోసం డీఎంఈ, కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పడం అవాస్తవమని కలెక్టర్ తెలిపారు.
ఎవరి కోసం?: నిలోఫర్ ఆస్పత్రిలో ప్రైవేట్ మందుల దుకాణం కోసం ఏకంగా పార్కు స్థలంలోనే కాంక్రీట్ కట్టడం నిర్మించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. సీఎం కార్యాలయ ఆదేశాలతో మంత్రి దామోదర, కలెక్టర్లతో చర్చించి మందుల దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్టు నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ ‘సాక్షి’కి ఫోన్‌లో తెలియజేశారు.
ఎమర్జెన్సీలో అవసరమైన మందుల కోసం వైద్యులు ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఆస్పత్రి ఆవరణలోనే మందుల దుకాణం పెట్టాలని అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. అయితే మంత్రి, కలెక్టర్, డీఎంఈలు సూపరింటెండెంట్ ప్రకటనను తోసిపుచ్చిన నేపథ్యంలో మందుల దుకాణం అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. నిజంగానే సీఎంఓ స్థాయిలో సూపరింటెండెంట్‌ను ప్రభావితం చేసేలా ఒత్తిళ్లు వచ్చా యా అని ఆరోగ్యశాఖలో చర్చ నడుస్తోంది.
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో నిర్వహిస్తున్న మందుల దుకాణాలపై కూడా మంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వమే రోగులకు ఉచితంగా మందులు అందజేస్తున్నప్పుడు ప్రైవేట్ మందుల దుకాణాలకు అనుమతి ఎందుకు ఇస్తారనే ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది.