breaking news
Private medical shop
-
నిలోఫర్‌లో ప్రైవేట్ మందుల దుకాణం కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో రాత్రికి రాత్రే నిర్మించిన మందుల దుకాణాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు అధికారు లు తొలగించారు. గురువారం నాంపల్లి తహసీల్దార్, ఇతర సిబ్బంది ఆస్పత్రి భవనం ఎదురుగా నిర్మించిన దుకాణాన్ని కూల్చివేయించారు. ‘రాత్రికి రాత్రే కట్టేశారు’శీర్షికన నిలోఫర్ ఆస్పత్రి ఆవరణలో ప్రైవేట్ మందుల దుకాణ నిర్మాణంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఆరోగ్యశాఖలో చర్చనీయాంశమైంది. దీనిపై సీఎం కార్యాలయంతోపాటు మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూను వివరణ కోరినట్టు సమాచారం. నిలోఫర్ ఆస్పత్రిలో ప్రైవేటు మందుల దుకాణం ఏర్పాటుకు సంబంధించిన అంశంపై విచారణ జరిపి వివరణ ఇవ్వాలని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ నరేంద్రకుమార్‌కు ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పందిస్తూ నిలోఫర్ ఆస్పత్రి క్యాంపస్‌లో నిర్మాణా లకు ఎవరికి అనుమతి ఇవ్వ లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మెడికల్ షాపు కోసం డీఎంఈ, కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పడం అవాస్తవమని కలెక్టర్ తెలిపారు. ఎవరి కోసం?: నిలోఫర్ ఆస్పత్రిలో ప్రైవేట్ మందుల దుకాణం కోసం ఏకంగా పార్కు స్థలంలోనే కాంక్రీట్ కట్టడం నిర్మించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. సీఎం కార్యాలయ ఆదేశాలతో మంత్రి దామోదర, కలెక్టర్లతో చర్చించి మందుల దుకాణం ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్టు నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ ‘సాక్షి’కి ఫోన్లో తెలియజేశారు. ఎమర్జెన్సీలో అవసరమైన మందుల కోసం వైద్యులు ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఆస్పత్రి ఆవరణలోనే మందుల దుకాణం పెట్టాలని అందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. అయితే మంత్రి, కలెక్టర్, డీఎంఈలు సూపరింటెండెంట్ ప్రకటనను తోసిపుచ్చిన నేపథ్యంలో మందుల దుకాణం అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. నిజంగానే సీఎంఓ స్థాయిలో సూపరింటెండెంట్‌ను ప్రభావితం చేసేలా ఒత్తిళ్లు వచ్చా యా అని ఆరోగ్యశాఖలో చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులలో నిర్వహిస్తున్న మందుల దుకాణాలపై కూడా మంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వమే రోగులకు ఉచితంగా మందులు అందజేస్తున్నప్పుడు ప్రైవేట్ మందుల దుకాణాలకు అనుమతి ఎందుకు ఇస్తారనే ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. -
సర్కారు ఆసుపత్రి.. ప్రైవేటు మందు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ప్రైవేట్ మందుల మాఫియా రాజ్యమేలుతోంది. పేద రోగులను పీల్చిపిప్పి చేస్తోంది. ఆసుపత్రిలోని ఉచిత ఫార్మసీలో లేని మందును, ఈ ప్రైవేట్ మెడికల్ షాపుల యజమానులు తెప్పిస్తారు. ఏ మందులు తెప్పించాలో డాక్టర్లు వీరికి చెప్తారు. అదే మందును స్టాక్ పెట్టి రోగులకు అమ్ముతారు. అందులో డాక్టర్ కమీషన్ కనీసం 10 నుంచి 20 శాతం ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులైన గాందీ, ఉస్మానియా, పేట్ల బురుజు, అలాగే వరంగల్‌లోని ఎంజీఎం, కరీంనగర్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మందుల షాపులు ఏటా రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి. ఉచిత మందులు ఇవ్వాల్సిన పెద్దాసుపత్రుల్లో బహిరంగంగా ప్రైవేట్ మందుల మాఫియా దోపిడీ కొనసాగుతున్నా, దాన్ని అడ్డుకునే నాథుడే లేకుండా పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఆ మందుల దుకాణాలెందుకు? రాష్ట్రంలో కీలకమైన ఈ ఆసుపత్రుల్లో సాధారణ జ్వరం మొదలు... అత్యంత కీలకమైన అవయవ మారి్పడి చికిత్సల వరకు జరుగుతుంటాయి. వీటిల్లో పేదలకు ఉచిత వైద్యం, ఉచిత మందులు ఇవ్వాలనేది లక్ష్యం. అయినా అక్కడ ఉచిత మందుల దుకాణాలున్నా, ప్రైవేట్ మందుల దుకాణాలు ఎందుకు పెట్టారన్నది అంతుబట్టని ప్రశ్న. గాంధీ ఆసుపత్రిలో ఓపీ బ్లాక్‌కు సరిగ్గా ఎదురుగా వరుసగా నాలుగు ప్రైవేట్ మెడికల్ షాపులున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఐదు, నిలోఫర్‌లో రెండు, పేట్లబుర్జు మెటర్నిటీ ఆసుపత్రిలో ఒకటి, కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండు ప్రైవేట్ మందుల దుకాణాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ మందుల దుకాణాలు ఉండవు.. కానీ దానికి అత్యంత సమీపంలోని మూడు మెడికల్ షాపులు కేన్సర్ మందులను అందుబాటులో ఉంచుతాయి. కొందరు ఆంకాలజిస్టులకైతే నెలకు ఐదారు లక్షల రూపాయల వరకు ఆ దుకాణాల నుంచి కమీషన్ తీసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. కొన్ని ఫ్రీగా... కొన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మెడికల్ దుకాణాలకు డాక్టర్లు, సూపరింటెండెంట్లు, రాష్ట్రస్థాయిలో కీలకమైన అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. వారి అండతోనే ప్రైవేట్ మందుల దుకాణాదారులు రెచ్చిపోతుంటారు. రోగికి వైద్యుడు నాలుగు రకాల మందులు రాస్తే, అందులో ప్రభుత్వ దుకాణంలో రెండే ఉంటాయి. మిగిలిన రెండింటిని ప్రైవేట్ దుకాణంలో కొనాల్సిందే. ఒక్కోసారి మందులున్నా కూడా లేవని ప్రభుత్వ ఫార్మసీ వారు చెబుతారు. అప్పుడు ప్రైవేట్‌లో కొనాల్సిందే. ఇక ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందులన్నీ దాదాపు బేసిక్‌వే. అడ్వాన్స్ ట్రీట్మెంట్కు అవసరమైన మందులు ఇవ్వాలంటే ఎంఎన్‌జే ఆసుపత్రిలో దొరకవు. పైగా అవి అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. కొన్ని డోసులైతే రూ.లక్షల్లో ఉంటాయి. సీఎంఆర్ఎఫ్ కింద బిల్లులు పెట్టి ప్రైవేట్ దుకాణాల్లో కొని వాడుతుంటారు. ఎంఎన్‌జే మినహా మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చే మందులను తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) సరఫరా చేస్తుంది. అయితే చాలామందులు అత్యాధునికమైనవి కాకుండా బేసిక్ మందులనే సరఫరా చేస్తుందన్న ఆరోపణలున్నాయి. ఆయా ప్రైవేట్ దుకాణాలను ఎత్తి వేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగకపోవడంతో రోగులు నష్టపోతున్నారు. కాగా, ప్రైవేట్ దుకాణాలు కోర్టుల్లో స్టేలు తెచ్చుకొని చలామణిలో ఉంటున్నాయని చెబుతున్నారు. రోజుకు జరిగే వ్యాపారం » గాంధీ ఆసుపత్రిలోని ప్రైవేట్ మందుల దుకాణాల్లో రూ. 10 లక్షలు » ఉస్మానియాలో రూ. 12 లక్షలు » ఎంఎన్‌జేపై ఆధారపడిన మూడు ప్రైవేట్ దుకాణాల్లో రూ.15 లక్షలు » ఎంజీఎంలో రూ. 5 లక్షలు -
పేరులోనే దవాఖానా!
► ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉండని మందులు ► గత్యంతరం లేక ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొంటున్న రోగులు రాష్ట్రంలో ఆరోగ్య ఉప కేంద్రాలు 4,797 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 683 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు 119 జిల్లా ఆసుపత్రులు 7 సాక్షి, హైదరాబాద్: అరకొర వైద్యం, అలసత్వాన్ని వీడని సిబ్బంది, అందుబాటులో ఉండని మందులు... వీటన్నింటికీ చిరునామా మన ప్రభుత్వాసుపత్రులు. రాష్ట్రంలో దాదాపు ఎక్కువ శాతం వైద్యశాలల పరిస్థితి ఇదే. రోగం వచ్చి ఆసుపత్రికి వెళితే.. సిబ్బంది ఉండరు. ఉన్నా.. వైద్యుడు రాసిన మందు గోలీలు అక్కడ ఉండవు. ఇదేంటని అడిగితే బయట తెచ్చుకోండి.. ఇక్కడలేవు అంటూ సమాధానమే వస్తోంది. వేల రూపాయలు పోసి మెడికల్ దుకాణాల్లో కొనలేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే వర్షాకాలంలో మందులను అందుబాటులో ఉంచాల్సిన టీఎస్ఎంఎస్ఐడీసీ వాటిని సరిగా పంపిణీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. మందుల సరఫరా ఏదీ... వర్షాకాలం మొదలవడంతో దోమల వ్యాప్తి వల్ల ఎక్కువ మంది ప్రజలు మలేరియా జ్వరం బారినపడి ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడుతున్నారు. కానీ అక్కడ సరిపడా మందులు దొరకకపోవడంతో బయట కొనుగోలు చేస్తున్నారు. అలాగే కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, వీరేచనాల బారినపడే వారికి అవసరమయ్యే మందులకూ కొరత నెలకొనడంతో రోగులు ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనలేక అవస్థలు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆస్పత్రులవారీగా కొరత ఉన్న సూది మందులు, మాత్రల పంపిణీ కోసం క్షేత్రస్థాయి సిబ్బంది కోరుతున్నా సరఫరా చేసే యంత్రాంగం పట్టించుకోవడంలేదు. కొరత ఉన్న మందులివీ.. ♦ మలేరియా నివారణ, చికిత్సకు ఇచ్చే ప్రిమాక్విన్ (7.5/2.5) ట్యాబ్లెట్లు. ♦ చిన్నారుల్లో జ్వరాన్ని తగ్గించే పారాసిటమాల్ డ్రాప్స్. విరేచనాలతో వచ్చే జ్వరాన్ని తగించే డెక్స్ట్రోస్ ఇంజెక్షన్కూ ఇదే పరిస్థితి. ♦ పురిటి నొప్పులు అయ్యేందుకు వీలుగా గర్భిణులకు ఇచ్చే ఆక్సిటోసిన్ సూది మందు. ♦ శిశువులకు నెలన్నర, మూడున్నర నెలల వయసులో కచ్చితంగా ఇవ్వాల్సిన పోలియో నివారణ సూది మందు (ఇనాక్టివ్ పోలియో వ్యాక్సిన్). ప్రైవేటు ఆస్పత్రుల్లో దీని ధర రూ. 3 వేలు. ♦ విరేచనాలు తగ్గేందుకు ఇచ్చే జెంటామైసిన్, మెట్రోనిండజోల్ సూది మందులు. ♦ వాంతులను తగ్గించేందుకు సరఫరా చేసే ఒండన్ సెట్రోన్, ప్రొమెతజైన్ సూది మందులు. ♦ కడుపు నొప్పి తీవ్రతను తగ్గించేందుకు ఇచ్చే డైసైక్లోమైన్ హెచ్‌సీఎల్ సూది మందు. ♦ కాలిన గాయాలకు చేసే చికిత్సలో ఉపయోగించే సిల్వర్ సఫ్లాడైజిన్. సూది మందు లేదట... ఆత్మహత్య చేసుకునేందుకు నా కొడుకు గడ్డి మందు మింగడంతో ఆస్పత్రికి తీసుకొచ్చినం. కానీ ఆస్పత్రిలో మందులు లేవట. బయట కొంటే ఒక్కో ఇంజెక్షన్‌కు రూ. 200 అయింది. – రాతిపెల్లి సాంబయ్య, బోరు నర్సాపురం, మంగపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బయట తెచ్చుకోమన్నారు.. జ్వరం మందులు ఆస్పత్రిలో లేవంటున్నారు. ఇదేంటని అడిగితే బయట తెచ్చుకోవాలని అంటున్నారు. – సిలువేరు మధు, చిప్పాయిగూడ, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా