గంజాయి స్మగ్లర్ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

గంజాయి స్మగ్లర్ అరెస్ట్

Published Fri, Aug 26 2016 8:27 PM

Marijuana smuggler arrested

ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి నుంచి 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన సీహెచ్ రాజా వెల్డింగ్ వర్కర్. ఆ రకంగా వచ్చే ఆదాయం సరిపోక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఇతడికి తుని ప్రాంతానికి చెందిన అనంత రమేష్‌తో పరిచయం ఏర్పడింది.

 

అప్పటికే గంజాయి వ్యాపారంలో ఉన్న రమేష్ తాను అందించే ‘సరుకు’ను చెప్పిన చోటుకు చేర్చితే ఒక్కో ట్రిప్‌కు రూ.10 వేల చొప్పున చెల్లిస్తానని రాజాకు చెప్పాడు. దీనికి అంగీకరించిన రాజాకు 40 కేజీల గంజాయిని 20 ప్యాకెట్లలో పార్శిల్ చేసి.. వాటిని రెండు ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి బుధవారం అందించాడు. ఈ గంజాయిని హైదరాబాద్ తీసుకెళ్లాలని, అక్కడికి చేరిన తర్వాత ఎవరికి ‘సరుకు’ డెలివరీ చేయాలో చెప్తానని అన్నాడు. దీంతో రాజా శుక్రవారం ఎంజీబీఎస్‌లో బస్సు దిగాడు. ఈ అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలోని బృందం వలపన్ని నిందితుడిని అరెస్టు చేసింది. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సీసీఎస్ ఆధీనంలోని యాంటీ నార్కొటిక్ సెల్‌కు అప్పగించారు.

Advertisement
Advertisement