గ్రేటర్‌పై డెంగీ పంజా..! | Malaria in city | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌పై డెంగీ పంజా..!

Aug 17 2015 12:10 AM | Updated on Jun 13 2018 8:02 PM

గ్రేటర్‌పై డెంగీ పంజా..! - Sakshi

గ్రేటర్‌పై డెంగీ పంజా..!

గ్రేటర్‌పై డెంగీ, మలేరియా జ్వరాలు మళ్లీ పంజా విసురుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆరోగ్య

ఈ ఏడాది వందకుపైగా కేసులు నమోదు
బాధితుల్లో ఏసీపీ సహా.. బాలింత, ఏడాది బాలిక

 
సిటీబ్యూరో : గ్రేటర్‌పై డెంగీ, మలేరియా జ్వరాలు మళ్లీ పంజా విసురుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆరోగ్య రాజధాని తాజాగా ఈ జ్వరాల పేరు వింటే చాలు ఉలిక్కిపడుతోంది. మురుగు నీరు పొంగి వీధుల్లో రోజుల తరబడి నిల్వ ఉండటం, దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేయక పోవడం వల్ల బస్తీవాసులపై విజృంభిస్తున్నాయి. బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్యామ్‌సుందర్‌రెడ్డి  వారం రోజుల నుంచి తీవ్రడెంగీ జ్వరంతో బాధపడుతుండగా, చికిత్స కోసం  ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే ఉప్పల్ పరిధిలోని స్వరూప్‌నగర్‌కు చెందిన వెంకటేష్ కుమార్తె ప్రణతి(1) జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు తార్నాకలోని సురక్ష ఆస్పత్రికి తరలించారు.  అప్పటికే ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గడంతో వైద్యులు అనుమానిత డెంగీ కేసుగా చేర్చుకుని చికిత్స చేస్తున్నారు. వ రంగల్‌కు చెందిన బాలింత మమత (20) తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఇటీవల ఉప్పల్ ఆధిత్య ఆస్పత్రిలో చేరగా పరీక్షించిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. ప్లేట్‌లెట్ కౌంట్ 13 వేలకు పడిపోవడంతో ప్రసవ సమయంలో ఆమెకు 36 యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఫీవర్ ఆస్పత్రిలో ప్రస్తుతం మరో ఐదుగురు డెంగీ అనుమానిత బాధితులు చికిత్స పొ ందుతున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం శివారు ప్రాంత వాసులే.

 మూడో స్థానంలో గ్రేటర్..
 రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,512 డెంగీ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే 12 మంది మృతి చెందారు. కాగా అత్యధిక కేసులు ఖమ్మం, వరంగల్,ఆదిలాబాద్ ఏజెన్సీ జిల్లాల్లో నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో 76 మలేరియా కేసులు నమోదు కాగా, వందకుపైగా డెంగీ కేసులు నమోదు అయ్యాయి. మరో లక్ష మందికిపైగా విష జ్వరాల బారిన పడినట్లు స్వయంగా అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య వేలల్లో ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 డెంగీని బూచిగా చూపి..
 జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారికంగా 1,470 పైగా మురికి వాడలు ఉన్నాయి. సంపన్నులు నివసించే బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఫిలింనగర్‌లతో పాటు సామాన్యులుండే లంగర్‌హౌస్, మాణికేశ్వరినగర్, గుడిమల్కాపూర్, మూసారంబాగ్, గోల్నాక, భోలక్‌పూర్, చిలకలగూడ, వారసిగూడ, పార్శీగుట్ట, గాంధీనగర్, ఉప్పల్, తదితర బస్తీల్లో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వ్యాధుల నివారణ కోసం జిల్లా వైద్యాధికారులు ముందస్తుగా ఓ యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సి ఉంది. ఆయా బస్తీల్లో పర్యటించి, వ్యాధులపై ముందే ఓ అంచనాకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నమే చేయలేదంటే ఆశ్చర్య పోనవసరం లేదు. ఇదిలా ఉంటే పలు కార్పొరేట్ ఆస్పత్రులు సాధారణ జ్వరాలతో బాధపడుతున్న వారికి డెంగీని బూచిగా చూపి నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి.వ్యాధి నిర్ధారణ కోసం ఐపీఎంకు రెండో శాంపిల్ పంపాలనే నిబంధన ఉన్నా..పట్టించుకోవడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement