ఓడినా ప్రజల మధ్యే ఉంటాం: కిషన్ రెడ్డి | Sakshi
Sakshi News home page

ఓడినా ప్రజల మధ్యే ఉంటాం: కిషన్ రెడ్డి

Published Sun, Feb 7 2016 3:18 AM

ఓడినా ప్రజల మధ్యే ఉంటాం: కిషన్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో గెలుపు ఒక్కటే లక్ష్యం కాదని, సైద్ధాంతిక భూమికతో ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తామని, ఓటమిని అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి 18 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. గెలుపు, ఓటమితో నిమిత్తం లేకుండా ప్రజల్లో ఉంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పని తీరులోని లోపాలను ప్రజలకు వివరించడంలో విఫలమైనట్లు ఆయన విశ్లేషించారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అధికార టీఆర్‌ఎస్ పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. ఓటమిపై పార్టీలో అంతర్గతంగా పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటామని పేర్కొన్నారు. పోలింగ్ శాతం తగ్గడంతో బీజేపీకి నష్టం వాటిల్లిందన్నారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే పరిస్థితి కొంత బాగుండేదన్నారు. ఎన్నికల్లో పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకుని, పునాదులను బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని చెప్పారు. టీడీపీతో పొత్తు వల్ల ఓడిపోయామనే ఆలోచన, అభిప్రాయాలు రాలేదన్నారు.

Advertisement
Advertisement