పంచాంగం సైన్సే

Kcr said panchangam is science - Sakshi

పంచాంగ రచన అద్భుత శాస్త్ర పరిజ్ఞాన శక్తి: సీఎం కేసీఆర్‌

50 ఏళ్ల తర్వాత వచ్చే గ్రహణాల కచ్చిత సమయాన్ని చెబుతుంది

తెలంగాణ దేవభూమి.. నిరంతరం ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది

అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్లకు వేతనాలివ్వడం దేశంలో ఎక్కడా లేదు

జాతి నిర్మాణంలో కీలక రాష్ట్రం మనదే..

ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ నూరుపాళ్లు నిజమవుతున్నాయి

ప్రగతి భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

సాక్షి, హైదరాబాద్‌ :  ‘‘దైవారాధన, పెద్దలు చెప్పిన మంచి విషయాలను అనుసరిస్తూ నిరంతరం మానవ ప్రయత్నం కొనసాగిస్తూ ముందుకు సాగాలి. ఇందుకు సంబంధించిన వివరాలు చెప్పే పంచాంగం.. జాతకం చెప్పటం లాంటిది కాదు. అది కచ్చితంగా సైన్స్‌..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ‘‘గ్రహాల గతి, గమనం, గ్రహణాల తీరు, వాటి వల్ల వచ్చే కాస్మిక్‌ ప్రభావంపై కచ్చితమైన సమాచారం ఉంటుంది. 50 ఏళ్ల తర్వాత వచ్చే గ్రహణాల పట్టు విడుపులపై ఘడియ, విఘడియలతో సహా కచ్చితమైన సమయాలను చెప్తుంది.టెలీస్కోప్‌ లాంటివి లేని సమయంలో కూడా ఈ కచ్చితత్వం వచ్చేలా మనకు అందించిన గొప్ప సనాతన పద్ధతి. అద్భుత శాస్త్ర పరిజ్ఞాన శక్తి పంచాంగ రచన’’అని కొనియాడారు.

ఉగాది పండుగ రోజు స్వీకరించే పచ్చడిని తినే పదార్థంగా కాకుండా జీవిత పరమార్థంగా పరిగణించాలని, జీవితం ఒకే రకంగా ఉండదని, కొంచెం సుఖం, కొంచెం కష్టం, కొంత సంతోషం, కొంత దుఃఖం ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం ఉద యం ప్రగతి భవన్‌లో విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారు. ఇందులో శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయన్నారు.

ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్లు నిజమవుతున్నాయని చెప్పారు. తెలంగాణ గొప్ప దేవ భూమి అని, ఇక్కడ ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో నిరంతరం ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందన్నారు. అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్లకు వేతనాలిచ్చే పద్ధతి తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. అన్ని వర్గాలను సమదృష్టితో ఆదరించే సంస్కారం తెలంగాణలో ఉందని, ఈరోజు ఉదయమే ఓ పెద్ద మనిషి తనతో అన్నట్టు పేర్కొన్నారు. చిరునవ్వులతో బతికే తెలంగాణ పరిఢవిల్లాలని, ప్రవర్ధమా నం కావాలని, అందుకు దేవుడు పంపిన కార్య కర్తల్లా అంతా కలసి కృషి చేయాలన్నారు.

కచ్చితంగా మిగులు రాష్ట్రమే
‘‘భావి తెలంగాణపై ఉద్యమ సమయంలో ఎన్నో ఆకాంక్షించాం, ఆశించాం, వాదించాం. రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం ఆ దిశగా ముందుకు సాగుతున్న నిజం కళ్ల ముందు కదలాడుతుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? స్వయం సమృద్ధంగా ఉంటూ కొన్ని రాష్ట్రాలకు సహాయ హస్తం కూడా అందిస్తున్నాం’’ అని సీఎం అన్నారు. సొంతంగా అభివృద్ధి చెందుతూ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నామని, ఇలాంటి రాష్ట్రాలు ఏడెనిమిదే ఉన్నాయని, అందులో తెలంగాణ కీలకమైందని చెప్పారు.

‘‘కేంద్రానికి మనం రూ.50 వేల కోట్ల వరకు ఇస్తాం. తిరిగి మనకు వచ్చేది రూ.24 వేల కోట్ల లోపే ఉంటుంది. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో ప్రధానితో కూడా చెప్పా. ఇప్పుడు విళంబినామ సంవత్సర పంచాంగం కూడా ఇదే చెప్తోంది. కచ్చితంగా తెలంగాణ మిగులు రాష్ట్రమే. ఈ విషయం మళ్లీ రుజువైంది’’అని అన్నారు. రాష్ట్రానికి ఏం ఢోకా లేదని, కచ్చితంగా మిగులు రాష్ట్రంగానే పురోగమిస్తుందని పేర్కొన్నారు.

ప్రజల్లో ఉంటే వాటంతట అవే టికెట్లు
నేతలెవరైనా హైదరాబాద్‌లో ఉండకుండా ప్రజల్లో ఉంటే టికెట్లు వాటంతట అవే వస్తాయని సీఎం అన్నారు. పోలీసు, ఆరోగ్య శాఖ తీరు బాగుంటుందని పంచాంగ పఠనంలో చెప్పటంతో మంత్రులు నాయిని, లక్ష్మారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి సంతోషంగా కనిపిస్తున్నారన్నారు. ‘‘ఎవరినీ కొట్టే పరిస్థితి ఉండదు. ఎవరినీ పట్టుకునే పరిస్థితి ఉండదు, దుర్మార్గుల ప్రకోపం తగ్గుతుందని చెప్పటం సంతోషం’’అని పేర్కొన్నారు.

‘‘తెలంగాణ రాశి నా రాశి కర్కాటకనే. నా సంగతి పక్కన పెడితే విళంబినామ సంవత్సరంలో ఈ రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా పంచాంగం చెబుతోంది. మిగులు రాష్ట్రానికి ఇది శుభసూచకమే. ఏతావాతా ఈ రాష్ట్రం వెలుగుజిలుగులు, సిరిసంపదలతో తులతూగుతుందని పంచాంగం చెప్పడం సంతోషం’’అని అన్నారు. ప్రసంగం చివర్లో సీఎం జై తెలంగాణ.. జై భారత్‌ అంటూ నినదించారు.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top