విశ్వ క్రీడా వేదికగా హైదరాబాద్‌ | KCR hands over Rs 5 crore cheque to PV sindhu | Sakshi
Sakshi News home page

విశ్వ క్రీడా వేదికగా హైదరాబాద్‌

Aug 23 2016 1:52 AM | Updated on Aug 14 2018 10:59 AM

విశ్వ క్రీడా వేదికగా హైదరాబాద్‌ - Sakshi

విశ్వ క్రీడా వేదికగా హైదరాబాద్‌

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు వంటి క్రీడాకారులను తయారుచేసేందుకు త్వరలోనే క్రీడా విధానాన్ని రూపొందిస్తామని..

► త్వరలో క్రీడా విధానం ప్రకటన: కేసీఆర్‌
► పీవీ సింధుకు రూ.5కోట్లు, గోపీచంద్‌కు రూ.కోటి చెక్కులు అందజేసిన సీఎం


సాక్షి, హైదరాబాద్‌: ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు వంటి క్రీడాకారులను తయారుచేసేందుకు త్వరలోనే క్రీడా విధానాన్ని రూపొందిస్తామని.. హైదరాబాద్‌ ను విశ్వ క్రీడా వేదికగా మారుస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గ్రామీణ  ప్రాంతాల్లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులున్నారని.. మట్టిలో మాణిక్యాల్లాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పీవీ సింధు, ఆమె కోచ్‌ గోపీచంద్‌లు సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన సీఎం.. సింధుకు రూ.5 కోట్లు, గోపీచంద్‌కు రూ.కోటి చెక్కులను అందజేశారు. సింధు దేశం గర్వించేలా ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబరిచిందని.. గోపీచంద్‌ తన అకాడమీ ద్వారా ఎంతో మంది క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. సింధును క్రీడలవైపు ప్రోత్సహించినందుకు ఆమె తల్లిదండ్రులు వెంకటరమణ, విజయలను అభినందించారు.

ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం
ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం సాధించడం గొప్ప విషయమని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇంత పెద్ద దేశం కేవలం రెండు పతకాలే గెలిచిందన్న విమర్శలు కూడా ఉన్నాయని.. క్రీడాకారులు వారంతటగా వారు ఎదుగుతూ పతకాలు సాధిస్తున్నారని, ప్రభుత్వపరంగా సరైన ప్రోత్సాహం లేదనే భావన ఉందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఒలింపిక్‌ పతకాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ క్రీడాకారులు, క్రీడాశాఖ అధికారులు, క్రీడా సంఘాలు, కోచ్‌లతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి క్రీడా విధానాన్ని ఖరారు చేస్తామని తెలిపారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల నాటికి విధానాన్ని రూపొందించి, తగినన్ని నిధులు కేటాయిస్తామన్నారు. గతంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఆటలాడేవారని, ఇప్పుడు మార్కుల సాధనే లక్ష్యంగా మారిపోయిందని పేర్కొన్నారు.  

జిల్లాల్లోనూ క్రీడా ప్రాంగణాలు
విశ్వక్రీడా పోటీలకు వేదికగా హైదరాబాద్‌ను మార్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ పిల్లలు అంతర్జాతీయ క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తామన్నారు. హైదరాబాద్‌లో ఎన్నో క్రీడా ప్రాంగణాలు ఉన్నాయని, వాటన్నింటినీ వినియోగంలోకి తేవాల్సి ఉందని చెప్పారు. జిల్లాల్లోనూ మరిన్ని క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తామని.. హకీంపేటలో క్రీడల కోసం కేటాయించిన 300 ఎకరాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పీవీ సింధు ఫిజియో థెరపిస్ట్‌ కిరణ్, ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన శ్రీకాంత్‌లకు రూ.25 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని సీఎం ప్రకటించారు. గోపీచంద్‌ అకాడమీకి కూడా ఆర్థిక చేయూత అందిస్తామన్నారు. జిల్లాల్లోనూ అకాడమీలను నెలకొల్పాలని కోచ్‌ గోపీచంద్‌కు సూచించారు. మంత్రులు కేటీఆర్, నాయిని, చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీలు మురళీధర్‌రావు, పూల రవీందర్, వెంకటరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సలీం, ప్రభుత్వ సీఎస్‌ రాజీవ్‌శర్మ, తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement