చలి పంజా | Karuvaina shelter abhagyulu | Sakshi
Sakshi News home page

చలి పంజా

Nov 9 2013 3:39 AM | Updated on Sep 2 2017 12:25 AM

వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చి రాత్రివేళల్లో తల దాచుకునేందుకు కనీసం పైకప్పు కూడా కరువై తల్లడిల్లుతున్న అభాగ్యులు ఎందరో!

 

 =ఆశ్రయం కరువైన అభాగ్యులు
 = చలికి విలవిల
 =ప్రకటనలకే పరిమితమైన నైట్ షెల్టర్లు
 =పట్టనట్టుగా వ్యవహరిస్తున్న జీహెచ్‌ఎంసీ

 
సాక్షి, సిటీబ్యూరో : లాంటివారు పదులు.. వందలు కాదు.. వేలల్లోనే ఉన్నారు. ఎముకలు కొరికే చలిలో సైతం రోడ్డు పక్కన.. మూసివేసిన దుకాణాల ముందు.. బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లు.. ఆస్పత్రుల పరిసరాల్లో చలిని తట్టుకోలేక కడుపులో కాళ్లు ముడుచుకుంటూ అవస్థలు పడుతున్న వారెందరో. అనాథలు.. యాచకులు.. ఇతరత్రా ప్రజలందరిదీ ఇదే దుస్థితి.

ఈ పరిస్థితి వల్ల ఆత్మగౌరవం దెబ్బతిని.. తీవ్ర నిరాశానిస్పృహల్లో కొట్టుకుపోకుండా ఉండేందుకు.. వారి గౌరవానికి భంగం కలుగ కుండా ఉండేందుకు.. వారికోసం నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిందిగా ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా వాటిని జీహెచ్‌ఎంసీ అమలు చేయడం లేదు. ఐదు లక్షల జనాభా  దాటిన నగరాల్లో లక్షమందికి ఒకటి చొప్పున ఇలాంటి నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలి. ఆ లెక్కన నగరంలో 70కి పైగా నైట్‌షెల్టర్లుండాలి. కానీ ఇప్పటివరకు పది కూడా ఏర్పాటు కాలేదు.

ఏర్పాటైనవి సైతం నిరాశ్రయులకు అందుబాటులో లేకుండా ఎక్కడెక్కడో ఉండటంతో తక్కువమంది మాత్రమే వాటిని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల అవసరాల కోసం వచ్చేవారిలో వందలాది మంది ఆయా ఆస్పత్రుల సమీపాల్లో కనిపిస్తున్నారు. అలాగే.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వంటి ప్రాంతాల్లో వీరి సంఖ్య ఎక్కువ. వీటిని దృష్టిలో పెట్టుకొని నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు పడుతున్న వారెందరో.

గత సంవత్సరం ఇలాంటి వారి దుస్థితిపై ‘సాక్షి’లో వెలువడిన కథనంతో స్పందించిన జీహెచ్‌ఎంసీ వర్గాలు చెప్పుకోవడానికన్నట్లుగా ఆయా ఆస్పత్రులకు మొక్కుబడి లేఖలు రాశాయి. మీ ఆస్పత్రుల ప్రాంగణాల్లో మీరే నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలంటూ ఎల్వీప్రసాద్, సరోజినీదేవి కంటి ఆస్పత్రులు.. ఉస్మానియా, గాంధీ, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రులకు లేఖలు రాసి చేతులు దులుపుకొన్నాయి. నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను జీహెచ్‌ఎంసీ పూర్తిగా విస్మరించింది.

జీహెచ్ ఎంసీయే వాటి ఏర్పాటుకు ముందుకొచ్చినట్లయితే.. అవసరమైన స్థలం ఇచ్చేందుకు ఆయా ఆస్పత్రులు ముందుకొచ్చేవేమో కానీ.. ఆ బాధ్యతను కూడా ఆస్పత్రులపైనే రుద్దడంతో ఏ ఆస్పత్రి కూడా సానుకూలంగా స్పందించలేదు. షరా మామూలుగానే.. షెల్టర్ లేని ప్రజలు తమ అవస్థలు తాము పడుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు చొరవ తీసుకొని .. బజార్లలోనే బతుకులీడుస్తున్న పేదలకు తగు భరోసా నివ్వాల్సి ఉంది.
 
 త్వరలో  వినియోగంలోకి రానున్నవి...

 = సరూర్‌నగర్ కమ్యూనిటీహాల్, ఎల్‌బీ నగర్
 = మల్లాపూర్, కాప్రా  కాచిగూడ
 = ఆర్‌కేపురం కమ్యూనిటీ హాల్, మల్కాజిగిరి
 
 ప్రస్తుతమున్న నైట్‌షెల్టర్లు
 1. బైబిల్‌హౌస్, సికింద్రాబాద్
 2. నామాలగుండు, సికింద్రాబాద్ (మహిళలు)
 3. అంబేద్కర్‌నగర్, టప్పాచబుత్రా
 4. పాత మునిసిపల్ కార్యాలయం, ఉప్పల్ (మహిళలు)
 5. వార్డు కార్యాలయం, యూసుఫ్‌గూడ
 6. గోల్నాక  7. హఫీజ్‌పేట
 8. బలహీనవర్గాల కాలనీ, శివరాంపల్లి
 9. పాత మునిసిపల్ కార్యాలయం, శేరిలింగంపల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement