పారిశ్రామిక రుణం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటనలో నలుగురు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.
బంజారాహిల్స్ (హైదరాబాద్) : పారిశ్రామిక రుణం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటనలో నలుగురు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు..బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే రోహిత్ రెడ్డి, ఆయన తండ్రి మధుమోహన్ రెడ్డి మిడ్‌ఫీల్డ్ ఇండస్ట్రీస్ పేరుతో పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రుణం ఇప్పించాల్సిందిగా రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తిని కోరగా ఫైనాన్షియర్‌ను కలిపించాడు.
ఈ ఏడాది జనవరి 14న రోహిత్ రెడ్డి రుణం కోసం రాజేంద్రప్రసాద్, త్యాగరాజన్, బాలాజీరావు తదితరులకు రూ.10 లక్షలు ఇచ్చాడు. అయితే రుణం మంజూరు కాకపోగా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినందుకు చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులు బౌన్స్ కావడంతో బాధితుడు డబ్బులు ఇవ్వాలని పలుమార్లు ప్రశ్నించగా నిందితులు లెక్కచేయకుండా బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో తనను మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.