ఉక్కిరిబిక్కిరి | Increased air pollution is heavy with Diwali fireworks | Sakshi
Sakshi News home page

ఉక్కిరిబిక్కిరి

Oct 29 2014 12:27 AM | Updated on Sep 2 2017 3:30 PM

ఉక్కిరిబిక్కిరి

ఉక్కిరిబిక్కిరి

వెలుగుల పండుగ నగవాసులను కాలుష్యపు కోరల్లో ముంచెత్తింది.

దీపావళి బాణసంచాతో  భారీగా పెరిగిన వాయుకాలుష్యం..
గతేడాదికంటే అధికం..
పీసీబీ తాజా  నివేదిక వెల్లడి
 

వెలుగుల పండుగ నగవాసులను కాలుష్యపు కోరల్లో ముంచెత్తింది. మతాబులు.. చిచ్చుబుడ్ల పొగలతో పీల్చే గాలి మరింత కలుషితమైంది.. ఊపిరి పీల్చుకోలేక సిటిజన్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీపావళి రోజు మహానగరం మహాకాలుష్యంగా తయారైందని కాలుష్య నియంత్రణ మండలి తాజా లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది కంటే ఈ సారి మోతాదు మరింత పెరిగింది. గ్రేటర్‌లోని 11 కేంద్రాల్లో వాయుకాలుష్యం సాధారణ రోజులకంటే పెరగడం గమనార్హం.

సల్ఫర్‌డయాక్సైడ్.. నైట్రోజన్ డయాక్సైడ్.. అమ్మోనియం తదితర రసాయనాలతో తయారు చేసిన మతాబులు..చిచ్చుబుడ్లు.. ఇతర బాణసంచాల నుంచి వెలువడిన వాయువులతో నగరంలో కాలుష్యం అనూహ్యంగా పెరిగిపోయింది. స్థూలకణాలు, ధూళికణాలు తదితర కాలుష్యకారకాల మోతాదు సాధారణం కంటే రెట్టింపు స్థాయికి చేరుకోవడంతో గ్రేటర్ వాసులు ఊపిరి పీల్చుకునేందుకు అపసోపాలు పడ్డారు. దీపావళి పర్వదినానికి ముందు (అక్టోబర్ 17న) నగరంలో 11 కేంద్రాల్లో నమోదైన వాయుకాలుష్యం, పండుగ రోజు (అక్టోబరు 23)న వాయుకాలుష్యాన్ని కాలుష్య నియంత్రణ మండలి వేర్వేరుగా లెక్కించింది. పండుగ రోజున మహానగర వాతావరణం మరింత కాలుష్యభరితం అయిందని తేలింది. ఇక గతేడాది దీపావళితో పోలిస్తే  ఈసారి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్‌ల మోతాదు భారీగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదిక వెల్లడించింది.

వాయుకాలుష్యం లెక్కించిన కేంద్రాలివే..

జూపార్క్, పంజగుట్ట, గచ్చిబౌలి కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద కంటిన్యూయస్ ఎయిర్ క్వాలిటీ యంత్రాలతో కాలుష్య మోతాదును ఆన్‌లైన్‌లో మానిటరింగ్ చేయగా.. అబిడ్స్, ప్యారడైజ్, చార్మినార్, బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, జీడిమెట్ల, కూకట్‌పల్లి ప్రాంతాల్లో సాధారణ పరికరాలతో దీపావళి ముందు(అక్టోబరు17),దీపావళిరోజున(అక్టోబరు23)న వేర్వేరుగా వాయుకాలుష్యాన్ని లెక్కించారు.
 
మూడురెట్లు పెరిగిన కాలుష్యం..


పంజగుట్ట(వాణిజ్యప్రాంతం)లో సాధారణ రోజుల్లో స్థూలధూళికణాలు (పీఎం10) క్యూబిక్ మీటర్ గాలిలో 85 మైక్రోగ్రాములుంటే.. దీపావళి రోజున 281 మైక్రోగ్రాములకు చేరింది. కూకట్‌పల్లి(నివాసప్రాంతం)లో సల్ఫర్‌డయాక్సైడ్ మోతాదు సాధారణ రోజుల్లో క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములుంటే.. పండుగ రోజున 17.1 మైక్రోగ్రాములకు చేరింది. నైట్రోజన్ డయాక్సైడ్ మోతాదు బాలానగర్(పారిశ్రామికవాడ)లో సాధారణ రోజుల్లో 5.1 మైక్రోగ్రాములుంటే.. దీపావళి రోజున 40.7 మైక్రోగ్రాములకు చేరడం గమనార్హం. అమ్మోనియా మోతాదు క్యూబిక్‌మీటరు గాలిలో ప్యారడైజ్ (వాణిజ్య ప్రాంతం)లో సాధారణ రోజుల్లో 177 మైక్రోగ్రాములుంటే.. పండుగవేళ 231 మైక్రోగ్రాములకు చేరింది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు,మూడు రెట్లు అధికంగా పండగ రోజున కాలుష్యం నమోదైనట్లు స్పష్టమైంది.

వాతావరణంలో అనూహ్య మార్పులు

మతాబుల పేలుళ్ల కారణంగా వెలువడిన పొగలో కాలుష్యకారకాల మోతాదు పరిమితి మించడంతో గాలి వేగం 0.7 మీటర్/సెకను నుంచి 2.0 మీటర్/సెకనుకు పెరిగింది.గాలి వేగం పెరగడంతో గాలిలోని కాలుష్యకారకాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గాలిద్వారా వేగంగా చేరాయి. సిటీజన్ల ముక్కుపుటాలను అదరగొట్టాయి. ఊపిరితిత్తులను ఉక్కిరిబిక్కిరిచేశాయి. ఉష్ణోగ్రతలు 28.9 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు పెరిగాయి. గాలిలో తేమశాతం 53 శాతం నుంచి 64 శాతానికి పెరిగింది. గాలి పీడనం 727 ఎంఎంహెచ్‌జీ నుంచి 729 ఎంఎంహెచ్‌జీకి పెరిగింది.పెరిగిన వాయుకాలుష్యంతో కలిగిన ఇబ్బందులు..  శ్వాసకోశ సంబంధ వ్యాధులున్నవారు ఊపిరి తీసుకోవడం కష్టతరమైంది. {బాంకైటిస్‌తో పలువురు సతమతమయ్యారు. కళ్లు, ముక్కు మంటలతో ఇబ్బందులు పడ్డారు.     శరీరజీవకణాలకు ఆక్సిజన్ అందకపోవడంతో అనారోగ్యానికి గురయ్యారు.    ఊపిరితిత్తుల్లో మంటతో ఇబ్బందులు పడ్డారు.

http://img.sakshi.net/images/cms/2014-10/71414523510_Unknown.jpg
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement