
కొందుర్గులో కుండపోత
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గులో అత్యధికంగా 18 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఒక ప్రాంతంలో ఈమేర కుండపోత వర్షం కురవడం ఇదే మొదటిసారని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
అలాగే బూర్గుంపాడులో 14, ములకలపల్లిలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నారాయణఖేడ్‌లో 11, జడ్చర్ల, పర్వతగిరి, జూలూరుపాడుల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. దుమ్ముగూడెం, మధిర, ఖానాపూర్, యాచారం, రామన్నపేట, నర్సంపేటల్లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదైంది. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.