గ్రేటర్‌లో వలసలతో చిక్కి శల్యమవుతున్నా కేడర్ తమతోనే ఉందని టీటీడీపీ భావిస్తోంది.
రెండుమార్లు లోకేశ్‌తో భేటీ
చంద్రబాబు ప్రచారంపై ఆశలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో వలసలతో చిక్కి శల్యమవుతున్నా కేడర్ తమతోనే ఉందని టీటీడీపీ భావిస్తోంది. ద్వితీయ శ్రేణి నేతలు, మాజీ కార్పొరేటర్లు అధికార టీఆర్‌ఎస్‌లోకి తరలిపోతుండగా, మరోవైపు వచ్చే నెలలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వంద స్థానాలు గెలుచుకోవాలని వ్యూహరచన చేస్తోంది. బీజేపీతో సమన్వయంగా ముందుకు వెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు సూచించిన నేపథ్యంలో ముందస్తు కసరత్తు మొదలు పెట్టింది. దీని కోసం ఆ పార్టీ నాయకులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో 2 పర్యాయాలు సమావేశమై చర్చించారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు.
అయితే, రెండు సమావేశాల్లోనూ చంద్రబాబు గ్రేటర్ ప్రచారానికి వస్తారా, రారా అన్న అంశంపైనే ఎక్కువగా చర్చించారని సమాచారం. ఆయనపైనే తెలంగాణ తమ్ముళ్లు ఆశపెట్టుకున్నారని చెబుతున్నారు. నగర కమిటీ అధ్యక్షుడిగా కృష్ణయాదవ్ స్థానంలో ఎమ్మెల్యే గోపీనాథ్‌ను నియమించడం ఈ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోపీనాథ్ కార్యకర్తలను కలుపుకొని పోవడంలో విఫలమవుతున్నారని ఇప్పటికే నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే, పలువురు నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇంకోవైపు మిత్రపక్షమైన బీజేపీతో సమన్వయం కూడా ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంటున్నారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. టీడీపీ నాయకులు తమకు సహకరించలేదని బీజేపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాకుండా నూటా ఏభై డివిజన్లు ఉన్న గ్రేటర్‌లో ఈ పార్టీల మధ్య సీట్ల పంపకం పెద్ద సమస్యగా మారనుందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.