ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ జర్నలిస్టులకు ప్రకటించిన నగదు అవార్డులను 8 వారాల్లోపు చెల్లించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ జర్నలిస్టులకు ప్రకటించిన నగదు అవార్డులను 8 వారాల్లోపు చెల్లించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 2012లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొందరు పాత్రికే యులను ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపిక చేసిందని, కొందరికి నగదు అవార్డు లిచ్చి, మరికొందరికి ఇవ్వకపోవడం వివక్ష చూపడమేనంటూ కొండూరి రమేశ్ బాబు, వనం వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు.
ఉత్తమ జర్నలిస్టుల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 33 మందిని ఎంపిక చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.ఎస్.అర్జునకుమార్ తెలిపారు. వీరిలో ఇద్దరికే నగదు అవార్డును అందజేసి, మిగిలిన వారికి ఇవ్వలేదన్నారు. ఈ వాదనలను పరిగణ నలోకి తీసుకున్న న్యాయమూర్తి అవార్డులు ఇవ్వనివారికి 8 వారాల్లోపు వాటిని చెల్లించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.