చరిత్ర తెలుసుకో.. | harishrao fire on amith sha | Sakshi
Sakshi News home page

చరిత్ర తెలుసుకో..

Sep 19 2016 2:55 AM | Updated on Aug 15 2018 9:35 PM

చరిత్ర తెలుసుకో.. - Sakshi

చరిత్ర తెలుసుకో..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చరిత్ర తెలుసుకోకుండా సెప్టెంబర్ 17పై అవాకులు చెవాకులు మాట్లాడారని సాగునీటి పారుదల మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

అమిత్ షాపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు
మోదీ.. కేసీఆర్ పాలనను పొగుడుతుంటే  మీరు విమర్శిస్తారా?

మత రాజకీయాలతో ఇక్కడ చిచ్చుపెడతామంటే కుదరదు
ఫిరాయింపులపై మీరా మాట్లాడేది..?
అరుణాచల్‌లో ఏం చేశారో దేశమంతా తెలుసు
కేసీఆర్ ఎవరికీ భయపడే రకం కాదు

 
సాక్షి, హైదరాబాద్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చరిత్ర తెలుసుకోకుండా సెప్టెంబర్ 17పై అవాకులు చెవాకులు మాట్లాడారని సాగునీటి పారుదల మంత్రి  హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ పాలనను ప్రధాని మెచ్చుకుంటే.. అమిత్ షా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వరంగల్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలరాజ్, గణేశ్ గుప్తాలతో కలసి హరీశ్ మీడియాతో మాట్లాడారు.

‘‘మత రాజకీయాలు నడిపే బీజేపీకి లౌకికవాద రాజకీయాల విలువ తెలియదు. బీజేపీ, టీఆర్‌ఎస్ ఎజెండాకు కచ్చితమైన తేడా ఉంటుంది. ప్రశాంత తెలంగాణలో మత రాజకీయాలతో చిచ్చుపెడతామంటే కుదరదు. బీజేపీ నేతల మాటల గారడీ విద్యలు గుజరాత్‌లో చెల్లినట్లు ఇక్కడ చెల్లవు’’ అని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎవరికో భయపడే రకం కాదనే విషయం అమిత్ షా తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ మొండి ఘటం కాబట్టే 14 ఏళ్లు పోరాడి కేంద్రాన్ని కదిలించారన్నారు.
 
అప్పుడెందుకు గుర్తుకు రాలేదు?
ఇప్పుడు సెప్టెంబర్ 17 గురించి మాట్లాడుతున్న అమిత్‌షాకు.. గతంలో టీడీపీతో పొత్తుపెట్టుకొని అధికారంలో కొనసాగినప్పుడు ఎందుకు గుర్తురాలేదని హరీశ్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తిరంగాయాత్రను కశ్మీర్‌లో నిర్వహించాలని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుల గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ వ్యవహరించిన తీరు యావత్ దేశమంతా చూసింది. సీఎంతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ పార్టీ ఫిరాయించేలా చేసిన ఘనత బీజేపీకే చెల్లింది. తెలంగాణకు రాష్ట్ర వాటాగా రావాల్సిన నిధుల కంటే ఒక్క రూపాయి అయినా అదనంగా ఇచ్చారా’’ అని హరీశ్ ప్రశ్నించారు. పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి ఏ మేరకు చెల్లిస్తున్నారో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని అడిగి తెలుసుకోవాలని సూచించారు.

కేంద్రం వల్ల తెలంగాణకు ప్రత్యేకంగా ఒరిగిందేమి లేదని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సైతం తుంగలో తొక్కారన్నారు. ఖాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, హైకోర్టు విభజన తదితర వాటిని కేంద్రం అటకెక్కించిందని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం.. తెలంగాణకు ఏమిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామంటున్న కేంద్రం.. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ 1990లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి విస్మరించిందని, అలాగే రామమందిరం, ఆర్టికల్ 370డి, నల్లధనం హామీలను నెరవేర్చలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement