అ,ఆ..లూ రావట్లేదు!
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కనీసం తెలుగు కూడా చదవడం, రాయడం రావడం లేదు.
- ఐదో తరగతిలో 46 శాతం మందికి తెలుగు చదవడం రావట్లేదు..
- 59 శాతం మందికి రాయడానికి ఇబ్బందే
- ఇంగ్లిష్‌లో సులభ పదాలు రాయగలిగిన వారు 26 శాతమే
- 8వ తరగతి విద్యార్థుల్లోనూ ఇదే పరిస్థితి
- రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల దుస్థితి
- 2015-16 విద్యాశాఖ అంతర్గత సర్వే తేల్చిన వివరాలివి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కనీసం తెలుగు కూడా చదవడం, రాయడం రావడం లేదు. ఏటా వివిధ పథకాల కింద వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా... సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నా... విద్యార్థులకు మాత్రం చదువు ఎక్కడం లేదు. కనీస లెక్కలైన కూడికలు, తీసివేతలూ రావడం లేదు. ఇంగ్లిష్‌లోనైతే పరిస్థితి మరీ దారుణం. ఏడో తరగతి, ఐదో తరగతి విద్యార్థులు కూడా రెండో తరగతిలోని పాఠ్యాంశాలను చదవడం, రాయడం కోసం ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విస్తుపోయే ఈ వాస్తవాలు ఏ ప్రైవేటు సంస్థనో, ఏదో ఎన్జీవోనో చెప్పినవి కావు. 2015-16 విద్యా సంవత్సరంలో స్వయంగా విద్యాశాఖ అంతర్గతంగా అధ్యయనం చే సి తేల్చిన వాస్తవాలివి.
5వ తరగతిలో తెలుగు చదవగలిగిన వారు 54 శాతమే
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 27.92 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా... అందులో 2.50 లక్షల మందికి పైగా ఐదో తరగతిలో ఉన్నారు. వారిలో 54 శాతం మంది మాత్రమే ఐదో తరగతి తెలుగును చదవగలుగుతున్నారు. మరో 46 శాతం మందికి తెలుగు చదవడమే రావడం లేదు. తెలుగులో రాయగలిగిన వారు కేవలం 41 శాతం మంది మాత్రమే. ఇంగ్లిష్ సబ్జెక్టులో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. 40 శాతం మంది మాత్రమే ఆ తరగతి ఇంగ్లిష్ సబ్జెక్టులోని అంశాలను చదవ గలుగుతున్నారు. ఇందులో కనీసం సులభ పదాలను రాయగలిగిన వారు 26 శాతమే. ఇక 32 శాతం మంది మాత్రమే భాగహారం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. 54 శాతం మందికి గుణకారాలు రావడం లేదు. 34 శాతం మందికి కూడికలు, 46 శాతం మంది విద్యార్థులకు తీసివేత లెక్కలు కూడా రాకపోవడం గమనార్హం.
8వ తర గతిలోనూ అంతే..
ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో 38 శాతం మంది మాత్రమే ఆ తరగతికి చెందిన ఇంగ్లిష్ సబ్జెక్టులోని సులభ పదాలను రాయగలుగుతున్నారు. 62 శాతం మంది సులభ పదాలను కూడా రాయలేకపోతున్నారు. 48 శాతం మంది ఇంగ్లిష్ సబె ్జక్టు పుస్తకంలోని అంశాలను చదవలేకపోతున్నారు.
కింది తరగతుల పదాలు చదవలేని పరిస్థితి!
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో చాలా మంది కింది తరగతుల్లోని పాఠ్య పుస్తకాలను కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నారు. 3వ తరగతి చదివే విద్యార్థుల్లో 23.1శాతం మంది మాత్రమే రెండో తరగతి పాఠ్య పుస్తకాన్ని చదవగలుగుతున్నారు. ఐదో తరగతి విద్యార్థుల్లో 56.3 శాతం మంది విద్యార్థులు మాత్రమే రెండో తరగతికి చెందిన పాఠ్య పుస్తకాల్లోని అంశాలను చదవగలగడం దారుణమైన విషయం. ఏడో తర గతి విద్యార్థుల్లోనూ 28.2 శాతం మంది రెండో తరగతి పాఠ్య పుస్తకాల్లోని అంశాలను చదవలేకపోతున్నట్లు విద్యాశాఖ తేల్చింది.


