వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయాల్లో కావాల్సిన అనుభవాన్ని ఇచ్చేందుకే దేవుడు ఈ విధంగా చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు.
మణికొండ,న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయాల్లో కావాల్సిన అనుభవాన్ని ఇచ్చేందుకే దేవుడు ఈ విధంగా చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ఆదివారం నగర శివారులోని మణికొండ ‘ది లైఫ్’ చర్చిలో ఆమె ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో తనవారెవరు, కానిదెవరనే విషయం జగన్‌కు గత మూడేళ్ల అనుభవంలో తెలిసివచ్చిందన్నారు.
కుట్రలు, ఇతరులను ఇబ్బందిపెట్టడమే ధ్యేయంగా చేసే కుటిల రాజకీయాలు ఎలా ఉంటాయో, వాటినెలా తట్టుకుని నిలబడాలో దేవుడు నేర్పించాడన్నారు. జగన్‌కు కష్టపడే మనస్తత్వం, దృఢసంకల్పం, నిగ్రహశక్తితో అనుకున్నది సాధించే గుణాలు ఉన్నాయన్నారు. 16నెలల జైలు జీవితాన్ని శిక్షగా కాకుండా రాజకీయ శిక్షణగా భావిస్తున్నారని ఆమె చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణించినపుడే జగన్‌బాబు సీఎం అయ్యుంటే ఎవరు ఏమిటనే విషయం తెలిసేది కాదన్నారు.
అతనిపై మోపిన నింద, జరిగిన అవమానాల నుంచి దేవుడే బయటకు తెస్తాడని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నీతినిజాయితీగల వ్యక్తులపై ఇలాంటివి సహజమేనని, వాటిని ఎదుర్కొనే సత్తా జగన్‌లో ఉందని కుండబద్దలు కొట్టారు. అల్లారుముద్దుగా పెంచుకున్న షర్మిల ఎండావానలో 3,112 కిలోమీటర్ల పాదయాత్ర చేయటం బాధించిందన్నారు. విజయమ్మతోపాటు మనవరాళ్లు, వైఎస్ సోదరి విమలమ్మ తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.