వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు మద్దతుగా జిల్లాలో ఆ పార్టీ నాయకులు దీక్షలు కొనసాగిస్తున్నారు. విజయమ్మ స్ఫూర్తితో మొక్కవోని ‘దీక్ష’ చేస్తున్నారు.
సాక్షి, అనంతపురం : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు మద్దతుగా జిల్లాలో ఆ పార్టీ నాయకులు దీక్షలు కొనసాగిస్తున్నారు. విజయమ్మ స్ఫూర్తితో మొక్కవోని ‘దీక్ష’ చేస్తున్నారు. వారు చేపట్టిన దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరాయి. ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలియజేశారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య భారతి, తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, పుట్టపర్తిలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ ఆమరణ దీక్ష కొనసాగించారు.
పైలా నర్సింహయ్యకు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి, స్థానిక ప్రజలు సంఘీభావం తెలిపారు. డాక్టర్ హరికృష్ణకు పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త కడపల మోహన్‌రెడ్డితో పాటు కొత్తచెరువు నుంచి వేలాది మంది పాదయాత్రగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. కదిరిలోని ఇందిరాగాంధీ కూడలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌ఎండీ ఇస్మాయిల్, ట్రేడ్ యూనియన్ నాయకుడు బయప్ప ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
ఉరవకొండలో రిలే దీక్షలు చేపట్టిన పార్టీ కార్యకర్తలకు సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి మద్దతు తెలిపారు. తాడిమర్రి, కళ్యాణదుర్గం, నల్లమాడ, శింగనమల, నార్పల, యల్లనూరు, యాడికిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఆయా దీక్షా శిబిరాల్లో నాయకులు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఒకవైపు ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తూనే.. మరోవైపు ఆ పార్టీ నాయకులతో సమైక్యాంధ్ర అంటూ వీధి నాటకం ఆడిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఆయన ఇచ్చిన లేఖల వల్లే నేడు రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. ఏ మొహం పెట్టుకుని సీమాంధ్రలో బస్సు యాత్ర చేస్తారని ప్రశ్నించారు.
సమైక్యాంధ్రకు మద్దతు తెలపకుండా బస్సు యాత్ర చేపడితే.. ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కారణం కాంగ్రెస్, టీడీపీలేనని పునరుద్ఘాటించారు. దిగ్విజయ్‌సింగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాత్రమేనన్న విషయం మరచి.. రాష్ట్రానికి సీఈఓలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌ను ప్రధాని చేయాలన్న ఉద్దేశంతోనే సోనియా రాష్ట్ర ప్రజలను విడదీస్తోందని దుయ్యబట్టారు. ఆమె విదేశీయురాలు కాబట్టే ఆంగ్లేయుల్లా ‘విభజించు.. పాలించు’ అనే నినాదాన్ని వంట బట్టించుకున్నారని విమర్శించారు.