బాలికను బలిగొన్న మూఢాచారం | girl died deu to Madness for belief | Sakshi
Sakshi News home page

బాలికను బలిగొన్న మూఢాచారం

Oct 8 2016 4:50 AM | Updated on Sep 4 2017 4:32 PM

బాలికను బలిగొన్న మూఢాచారం

బాలికను బలిగొన్న మూఢాచారం

వ్యాపారంలో నష్టాలు చవిచూసిన ఓ తండ్రి మూఢ నమ్మకం 13 ఏళ్ల బాలిక నిండు ప్రాణాలను బలిగొంది.. లాభాలు వస్తాయన్న పిచ్చి నమ్మకం

మత గురువు సూచన మేరకు 68 రోజుల పాటు ఉపవాసం
వ్యాపార నష్టాల నుంచి గట్టెక్కడానికి ఓ తండ్రి కర్కశం
శరీరంలోని అవయవాలు దెబ్బతిని ఈ నెల 3న మృతి చెందిన బాలిక
బాలల హక్కుల సంఘం చొరవతో వెలుగులోకి..

హైదరాబాద్: వ్యాపారంలో నష్టాలు చవిచూసిన ఓ తండ్రి మూఢ నమ్మకం 13 ఏళ్ల బాలిక నిండు ప్రాణాలను బలిగొంది.. లాభాలు వస్తాయన్న పిచ్చి నమ్మకం కన్న కూతురిని 68 రోజుల పాటు ఉపవాసం ఉంచేలా చేసింది.. పచ్చి మంచినీళ్లూ అందని స్థితిలో కడుపులో పేగులు ఎండిపోయి, కిడ్నీలు పాడైపోయి, ఇతర అవయవాలూ దెబ్బతిని ఆ బాలిక నరకం అనుభవించింది. ఆ యాతనతోనే చివరికి కన్నుమూసింది. సికింద్రాబాద్‌లోని కుండల మార్కెట్ సమీపంలో జరిగిన ఈ ఘటన బాలల హక్కుల సంఘం ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

 ఆచారం కోసం..
 సికింద్రాబాద్‌కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదరియా స్థానికంగా బంగారు నగల వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు ఆరాధన అనే 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. కొద్ది నెలల కింద లక్ష్మీచంద్ తన వ్యాపారంలో బాగా నష్టపోయాడు. దాంతో చెన్నైకు చెందిన ఓ మత గురువును ఇంటికి ఆహ్వానించి వ్యాపార నష్టాల గురించి వివరించాడు. ఆ మత గురువు లక్ష్మీచంద్ కుమార్తెను 68 రోజుల పాటు ఉపవాసం ఉంచితే వ్యాపారంలో అభివృద్ధి చెందుతావని అతడికి సూచించారు. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఆరాధనతో 68 రోజుల పాటు ఉపవాసం చేయించారు. వారి ఆచారం ప్రకారం ఇలా ఉపవాసం ఉండే వారు కేవలం మంచినీళ్లను మాత్రమే తీసుకోవాలి. అది కూడా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలో మాత్రమే నీళ్లు తాగాలి.

మిగతా సమయంలో తాగకూడదు. ఇలా మొదలు పెట్టిన 68 రోజుల ఉపవాసం ఈ నెల 3వ తేదీకి ముగిసింది. కానీ అప్పటికే ఆరాధన డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలో కిడ్నీలు సహా పలు అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. మరణించింది. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు, గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరాధన తండ్రి మూఢాచారంతో ఆమెను 68 రోజులు ఉపవాసం ఉంచారని వారు పేర్కొన్నారు. ఆమె డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలోని అన్ని అవయవాలు పూర్తిగా పాడవడంతో మరణించినట్లు కిమ్స్ వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు.

దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారని ఆరోపించారు. అభం శుభం తెలియని బాలికను మూఢాచారానికి బలి చేసిన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరహా ఉపవాసాలు, మతాచారాల కారణంగా ఎంతో మంది బలవుతున్నారనే  ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా మూడేళ్ల క్రితం ‘సంతార(చనిపోవడానికి)’ చేసే ఆచరణలను కొట్టివేసిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement