The girl died
-
వైద్యం వికటించి యువతి మృతి
♦ పరారైన వైద్యుడు ♦ బంధువుల ఆందోళన మెదక్‌జోన్: వైద్యం వికటించి ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటన జరగగానే వైద్యుడు పరారయ్యాడు. పట్టణంలోని ఆటోనగర్‌లో ఇటీవల ఉమాశంకర్ సాయిబాలాజీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆయన విద్యార్హతలు డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్జరీ అని ఉంది. హవేళి ఘణాపూర్ మండలం రాజిపేటకు చెందిన బాలకవిత (20)కు జ్వరం రావడంతో ఇటీవల ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ తీసిన వైద్యుడు.. కాలేయానికి నీరొచ్చిందని చెప్పి చికిత్స ప్రారంభించాడు. ఆరోగ్యం కొద్దిగా మెరుగు పడటంతో కవితను ఆమె తల్లి పాపమ్మ ఇంటికి తీసుకెళ్లింది. సోమవారం అనారోగ్యానికి గురికావడంతో తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. మూడు గంటల ప్రాంతంలో కవిత అపస్మారక స్థితికి చేరింది. విషయం పసిగట్టిన వైద్యుడు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ, స్వయంగా ఆటో పిలిపించి పంపించాడు. అప్పటికే కవిత చనిపోయినట్లు అక్కడ ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని సాయిబాలాజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యుడు ఆస్పత్రి నుంచి పరారయ్యారు. దీంతో మృతదేహాన్ని ఆస్పత్రిలో ఉంచి బంధువులు ఆందోళన చేపట్టారు. -
వైద్యం వికటించి యువతి మృతి
అన్నానగర్: వైద్యం వికటించి యువతి మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు ఆస్పత్రి ఎదుట రాస్తారోకో చేశారు. ఈ ఘటన మూలకడైపట్టిలో చోటుచేసుకుంది. నెల్లై జిల్లా మూలకడైపట్టి సమీపంలో ఉన్న కల్లత్తి ప్రాంతానికి చెందిన మనోహర్(50). ఇతని కుమార్తె ఉషారాణి(17). ఈమె ప్లస్‌టూ చదివి మూలకడైపట్టిలో ఉన్న ఓ ఫ్యాన్సీ స్టోర్‌లో పనిచేస్తోంది. గత 18వ తేదీ రాత్రి ఉషారాణికి కడుపునొప్పి రావడంతో సోమవారం మూలకడై ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం హఠాత్తుగా ఉషారాణి మృతి చెందింది. ఈ క్రమంలో తన కుమార్తె మృతికి ప్రైవేటు ఆస్పత్రి వైద్యమే కారణం అని మూలకడైపట్టి పోలీస్‌స్టేషన్‌లో మనోహర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఉషారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాళయంకోట ఐకిరవుండు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ఈ క్రమంలో ఉషారాణి కుటుం బీకులు, బంధువులు, స్థానికులు మంగళవారం మూలకడైపట్టిలో ఉన్న ఆస్పత్రి ఎదుట మెయిన్ రోడ్డులో ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న నాంగునేరి సహాయ పోలీసు సూపరింటెండెంట్ అరుణ్ బాలగోపాలన్, నాంగునేరి సీఐ సురేష్ బెలీక్స్‌పోర్, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపారు. ఉషారాణి మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవా లని, ప్రభుత్వ సాయం ఇవ్వాలని అధికారుల వద్ద డిమాండ్ చేశారు. సమస్య పరిస్కరిస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు. -
బాలికను బలిగొన్న మూఢాచారం
మత గురువు సూచన మేరకు 68 రోజుల పాటు ఉపవాసం • వ్యాపార నష్టాల నుంచి గట్టెక్కడానికి ఓ తండ్రి కర్కశం • శరీరంలోని అవయవాలు దెబ్బతిని ఈ నెల 3న మృతి చెందిన బాలిక • బాలల హక్కుల సంఘం చొరవతో వెలుగులోకి.. హైదరాబాద్: వ్యాపారంలో నష్టాలు చవిచూసిన ఓ తండ్రి మూఢ నమ్మకం 13 ఏళ్ల బాలిక నిండు ప్రాణాలను బలిగొంది.. లాభాలు వస్తాయన్న పిచ్చి నమ్మకం కన్న కూతురిని 68 రోజుల పాటు ఉపవాసం ఉంచేలా చేసింది.. పచ్చి మంచినీళ్లూ అందని స్థితిలో కడుపులో పేగులు ఎండిపోయి, కిడ్నీలు పాడైపోయి, ఇతర అవయవాలూ దెబ్బతిని ఆ బాలిక నరకం అనుభవించింది. ఆ యాతనతోనే చివరికి కన్నుమూసింది. సికింద్రాబాద్‌లోని కుండల మార్కెట్ సమీపంలో జరిగిన ఈ ఘటన బాలల హక్కుల సంఘం ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఆచారం కోసం.. సికింద్రాబాద్‌కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదరియా స్థానికంగా బంగారు నగల వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు ఆరాధన అనే 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. కొద్ది నెలల కింద లక్ష్మీచంద్ తన వ్యాపారంలో బాగా నష్టపోయాడు. దాంతో చెన్నైకు చెందిన ఓ మత గురువును ఇంటికి ఆహ్వానించి వ్యాపార నష్టాల గురించి వివరించాడు. ఆ మత గురువు లక్ష్మీచంద్ కుమార్తెను 68 రోజుల పాటు ఉపవాసం ఉంచితే వ్యాపారంలో అభివృద్ధి చెందుతావని అతడికి సూచించారు. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఆరాధనతో 68 రోజుల పాటు ఉపవాసం చేయించారు. వారి ఆచారం ప్రకారం ఇలా ఉపవాసం ఉండే వారు కేవలం మంచినీళ్లను మాత్రమే తీసుకోవాలి. అది కూడా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలో మాత్రమే నీళ్లు తాగాలి. మిగతా సమయంలో తాగకూడదు. ఇలా మొదలు పెట్టిన 68 రోజుల ఉపవాసం ఈ నెల 3వ తేదీకి ముగిసింది. కానీ అప్పటికే ఆరాధన డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలో కిడ్నీలు సహా పలు అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. మరణించింది. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు, గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరాధన తండ్రి మూఢాచారంతో ఆమెను 68 రోజులు ఉపవాసం ఉంచారని వారు పేర్కొన్నారు. ఆమె డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలోని అన్ని అవయవాలు పూర్తిగా పాడవడంతో మరణించినట్లు కిమ్స్ వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారని ఆరోపించారు. అభం శుభం తెలియని బాలికను మూఢాచారానికి బలి చేసిన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరహా ఉపవాసాలు, మతాచారాల కారణంగా ఎంతో మంది బలవుతున్నారనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా మూడేళ్ల క్రితం ‘సంతార(చనిపోవడానికి)’ చేసే ఆచరణలను కొట్టివేసిందని చెప్పారు.