ఫోరెన్సిక్ పరీక్షలకు సూసైడ్ నోట్ | Forensic test of the suicide note | Sakshi
Sakshi News home page

ఫోరెన్సిక్ పరీక్షలకు సూసైడ్ నోట్

Jan 21 2016 1:45 AM | Updated on Oct 4 2018 5:51 PM

ఫోరెన్సిక్ పరీక్షలకు సూసైడ్ నోట్ - Sakshi

ఫోరెన్సిక్ పరీక్షలకు సూసైడ్ నోట్

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు ముమ్మరం చేశారు.

♦ ‘కొట్టివేతల’పై పోలీసుల దృష్టి
♦ గుంటూరు జిల్లా గురజాలకు మాదాపూర్ ఏసీపీ
♦ రోహిత్ తండ్రి, తాత, నానమ్మల నుంచి వివరాల సేకరణ
♦ స్థానిక రెవెన్యూ అధికారులతోనూ సంప్రదింపులు
 
 సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు ముమ్మరం చేశారు. రోహిత్ రాసిన సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిం చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోహిత్ తండ్రి నివసిస్తున్న గుంటూరు జిల్లా గురజాలకు వెళ్లి కుటుంబీకులను విచారించారు. కేసులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లను చేర్చడంతో ప్రధానంగా కుల నిర్ధారణపై దృష్టి సారించారు. రోహిత్ రాసిన 5 పేజీల లేఖలో ఉన్న కొట్టివేతలపై విచారణ జరుపుతున్నారు. రెండు భాగాలుగా రాసిన ఈ లేఖలో మొత్తం మూడు చోట్ల రోహిత్ సంతకం చేశాడు. నాలుగు పేజీలు రాసిన తర్వాత సంతకం చేసి, మర్చిపోయిన అంశాలను మరో పేజీలో రాశాడు. నోట్‌లోని చేతి రాత, సంతకాలు రోహిత్‌వేనా అని నిర్ధారించుకునేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపిస్తున్నారు.

 కొట్టివేతల వెనుక ఏముంది..?
 ఆత్మహత్య చేసుకోవడానికి కారణాన్ని సూసైడ్ నోట్‌లో రోహిత్ ఎక్కడా ప్రస్తావించలేదు. మూడో పేజీలో 11 లైన్ల పేరా కొట్టేసి ఉంది. ‘ఈ పదాలను నా అంతట నేనే కొట్టేస్తున్నాను’ అని పేరా చివర్లో రోహిత్ రాసి సంతకం చేశాడు. నోట్‌లో మొత్తం 73 కొట్టివేతలున్నాయి. కేసు దర్యాప్తులో ఈ కొట్టివేతలు కీలకంగా మారవచ్చని అధికారులు చెబుతున్నారు.

 కుల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి
 రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్ 3ను చేర్చిన నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా కుల నిర్ధారణ తప్పనిసరి. అయితే ఇప్పటికే రోహిత్ కులంపై వివాదం చెలరేగడంతో కేసు దర్యాప్తు బాధ్యతలను మాదాపూర్ ఏసీపీ రమణకుమార్ చేపట్టారు. రోహిత్ కుల నిర్ధారణకు బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గురజాలకు వెళ్లి రోహిత్ తండ్రి నాగమణి కుమార్, తాత వెంకటేశ్వర్లు, నాయనమ్మ రాఘవమ్మలను విచారించారు. కుటుంబ నేపథ్యం, మణికుమార్ వివాహం, పిల్లలు తదితర అంశాలపై ఆరా తీశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, గురజాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఎస్సై తదితరుల నుంచి వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement