ఈవ్ టీజర్లకు ‘వీడియో క్లాసులు’! | Eve teaser to 'Video Classes'! | Sakshi
Sakshi News home page

ఈవ్ టీజర్లకు ‘వీడియో క్లాసులు’!

Oct 26 2015 12:51 AM | Updated on Jul 11 2019 8:06 PM

ఈవ్ టీజర్లకు ‘వీడియో క్లాసులు’! - Sakshi

ఈవ్ టీజర్లకు ‘వీడియో క్లాసులు’!

విద్యాసంస్థలు, బస్సులు, బస్టాప్‌లు, ట్యూషన్ కేంద్రాలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ ఇలా..

ఆకతాయిల్లో మార్పునకు షీ టీమ్ సభ్యులు, కౌన్సెలర్ల కృషి
వారి వీడియోను వారికే చూపించి
తప్పు ఒప్పుకునేలా చేస్తున్న వైనం..
తల్లిదండ్రుల సమక్షంలోనే మైనర్లకు హితబోధ

 
సిటీబ్యూరో: విద్యాసంస్థలు, బస్సులు, బస్టాప్‌లు, ట్యూషన్ కేంద్రాలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ ఇలా.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో విద్యార్థినులు, యువతులు ఎక్కడ కన్పిస్తారో.. అక్కడ పనీపాటా లేని యువకులు ప్రత్యక్షమవుతున్నారు. వెకిలిగా ప్రవర్తిస్తూ.. అసభ్యంగా వ్యాఖ్యానాలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ పోకిరీల బాధపడలేక బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు షీ టీమ్‌లు అంతటా జల్లెడపడుతున్నాయి. పదుల సంఖ్యలో ఈవ్‌టీజర్లను పట్టుకుంటున్నాయి. వీరిలో మైనర్లు ఉంటున్నారు. వారిపై కేసులు నమోదు చేస్తే భవిష్యత్ పాడవుతుందనే ఉద్దేశంతో అధికారులు మానసిక వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించి పంపుతున్నారు. ఆరు నెలల వ్యవధిలో దాదాపు 500 మంది బాలురకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అధికారులు పాఠాలు చెప్పారు.

సత్ఫలితాలిస్తున్న ‘ఈయర్’..
 సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈవ్‌టీజర్ల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు షీ టీమ్‌లు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈయర్ (ఎగ్జామిన్, అక్సెప్ట్, రిజెక్ట్) పద్ధతితో షీ టీమ్ పోలీసులు, కౌన్సిలర్లు (మానసిక నిపుణులు) సంయుక్తంగా ఆకతాయిల్లో అనూహ్య మార్పును తీసుకొస్తున్నాయి. ఈవ్‌టీజర్ల వ్యక్తిత్వాన్ని తెలుసుకునేందుకు వారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విషయాలతో పాటు స్నేహితులతో వారు గడిపే సమయంలో విషయాలపై ప్రశ్నావళి ఇచ్చి పూర్తి చేయమంటున్నారు. దీని ఆధారంగానే వారిని ఎగ్జామిన్ చేస్తున్నారు కౌన్సిలర్లు. అయినా అతడు ఈవ్ టీజింగ్ చేశానని ఒప్పుకోకపోతే షీ టీమ్‌లు షూట్ చేసిన వీడియోను చూపిస్తున్నారు. ఆ దృశ్యాలను చూసిన ఆకతాయిలు తప్పు ఒప్పుకుంటున్నారు. అప్పుడు వారికి బంగారు భవిష్యత్‌కు ఏర్పడే అడ్డంకులను వివరిస్తున్నారు. క్రిమినల్ రికార్డుల్లో పేరెక్కితే ఉద్యోగాలు రావని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. మరోమారు ఈవ్‌టీజింగ్ చేయమని వారితో అక్కడే ప్రతిజ్ఞ చేయిస్తున్నారు సైబరాబాద్ షీటీమ్ సభ్యులు, కౌన్సిలర్లు. దాదాపుగా నెలకు 127 ఈవ్‌టీజింగ్ కేసులు సైబరాబాద్ షీ టీమ్ లెక్కల్లోకి వెళ్తున్నాయి.

అయ్యో.. ఇలా చేస్తున్నారా..?
అమ్మాయిలను వేధిస్తున్న మైనర్లలో 80 శాతం మంది ఇళ్లలో మాత్రం బుద్ధిమంతులు.. తల్లిదండ్రులు చెప్పిన మాటలను జవ దాటరని కౌన్సెలింగ్ సమయంలో వారి తల్లిదండ్రుల ద్వారా వెల్లడైంది. మిగిలిన 20 శాతం మంది కట్టుతప్పారని వారి తల్లిదండ్రులకు తెలుసు. చెడు స్నేహాలు చెయ్యొద్దు.. పార్టీలు, సినిమాలంటూ అర్ధరాత్రి వరకు రోడ్లపై తిరగొద్దంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమం లో కొందరు ప్రవర్తన మార్చుకుంటూ ఉండగా.. మరికొందరు పిల్లలు ఎదురు తిరుగుతున్నారు. మానసిక నిపుణులు, పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించిన 330 మంది పిల్లల తల్లిదండ్రులకు తమ పిల్లలు ఈవ్‌టీజింగ్ చేస్తున్నట్లు ఏ మాత్రం తెలి యదు. వారి పిల్లలకు సంబంధించిన వీడియోల్ని తల్లిదండ్రులకు చూపించడంతో అవాక్కవుతున్నారు. వీరికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిందేనని ఒప్పుకుంటున్నారు.  
 
 ఈవ్‌టీజర్లపై కఠిన చర్యలు..
 బహిరంగ ప్రాంతాల్లో అమ్మాయిలను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 350 ప్రాంతాల్లో 60 బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. స్పై కెమెరాలతో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆకతాయిల ద ృశ్యాలను చిత్రీకరిస్తున్నాం. ఇటువంటి ఘటనల్లోనే మూడుసార్లు దొరికితే కఠిన చర్యలు ఉంటాయి.     -రమా రాజేశ్వరి, మల్కాజిగిరి డీసీపీ, షీ టీమ్ నిర్వాహకురాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement