నేరుగా పోలీస్ కస్టడీ ఎలా కోరతారు? | Deccan Chronicle vice-chairman PK Iyer arrested | Sakshi
Sakshi News home page

నేరుగా పోలీస్ కస్టడీ ఎలా కోరతారు?

Jun 9 2015 4:48 AM | Updated on Sep 3 2017 3:26 AM

ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకును మో సం చేసిన కేసులో నిందితుడు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ పీకే అయ్యర్‌ను 14 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని...

పీకే అయ్యర్ కస్టడీపై సీబీఐకి స్పష్టం చేసిన న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకును మో సం చేసిన కేసులో నిందితుడు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ పీకే అయ్యర్‌ను 14 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వై.వీర్రాజు విస్మయం వ్యక్తం చేశారు. నిందితున్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపకుండానే...నేరుగా తమ కస్టడీకి అప్పగించాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళ్తే...

ఓవర్‌సీస్ బ్యాం కును మోసం చేసిన కేసులో (ఆర్‌సీ 3ఈ/2014) నిందితునిగా ఉన్న పీకే అయ్యర్‌ను ఈనెల 6న భువనేశ్వర్‌లో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో అయ్యర్‌ను నాంపల్లి పధ్నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వీర్రాజు ఎదుట హాజరుపర్చారు. అయ్యర్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ఆయన్ను 14 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేస్తూ సీబీఐ పీపీకి ప్రశ్న లు సంధించారు. గతంలో వెంకటరామిరెడ్డి, వినాయక రవిరెడ్డిలను రిమాండ్ చేసింది ఈకేసులోనేనా అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఇది మరోకేసని సమాధానమిచ్చారు.
 
సీఆర్‌పీసీ నిబంధనలు పాటించారా ?
నిందితుని అరెస్టుకు ముందు నేర విచారణ చట్టంలోని నిబంధనలు పాటించారా అని న్యాయమూర్తి సీబీఐ పీపీని ప్రశ్నించారు. సెక్షన్ 41-ఎ కింద అరెస్టుకు కారణాలను స్పష్టంగా పేర్కొనాలని, సెక్షన్ 50-ఎ కింద కుటుంబ సభ్యులు, లేదా మిత్రులకు అరెస్టుకు సంబంధించి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. సీఆర్‌పీసీ నిబంధనలు పాటించకుండా నిందితున్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. సీఆర్‌పీసీ నిబంధనలు పాటిస్తూ పిటిషన్ దాఖలు చేయాలని సూచిస్తూ సీబీఐ అభ్యర్థనను తిరస్కరించారు. సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో తిరిగి అయ్యర్‌ను కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చారు. అయితే కోర్టు సమయం ముగియడంతో అప్పటికే న్యాయమూర్తి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement