మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎలాగైనా ఓడించాలని భావి స్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకోసం విపక్షాల సహకారాన్ని తీసుకోవాలని యోచిస్తోంది.
టీఆర్‌ఎస్ ఓటమి లక్ష్యంగా పనిచేద్దాం
దిగ్విజయ్‌సింగ్, కుంతియా, పొన్నాల, రాజనర్సింహ మంతనాలు
మెదక్ బరిలో బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట
పరిశీలనలో కోదండరాం, జైపాల్‌రెడ్డి పేర్లు
సాక్షి, హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎలాగైనా ఓడించాలని భావి స్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకోసం విపక్షాల సహకారాన్ని తీసుకోవాలని యోచిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలనే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, పరిశీలకుడు రామచంద్ర కుంతియా ఎదుట టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, ప్రొటోకాల్ చైర్మన్ వేణుగోపాలరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇదే అంశంపై చర్చలు జరిపారు.
మెదక్ ఉప ఎన్నికతోపాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించకపోతే భవిష్యత్‌లో ఆ పార్టీని నిలువరించడం కష్టమని వారు పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేనందున టీఆర్‌ఎస్ ఏకఛత్రాపధిత్యం కొనసాగుతుందని ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే విపక్షాల సహకారం అవసరమని, వారి సలహా మేరకు గట్టి అభ్యర్థిని నిలబెడదామని రాజనర్సింహ హైకమాండ్ పెద్దల ఎదుట ప్రతిపాదించినట్లు తెలిసింది. ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి అయితే జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను అభ్యర్థిగా నిల బెడితే టీఆర్‌ఎస్‌ను ఓడించడం సాధ్యమవుతుందని సూచించారు.
రెండు, మూడు రోజుల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల నేతలతో అంతర్గత సంప్రదింపులు జరపాలనే భావనకు వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే కోదండరాం సరైన వ్యక్తి అని, ఆయన పోటీకి ఒప్పుకోకుంటే కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని బరిలో దించితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జైపాల్‌రెడ్డి సైతం సానుకూలంగా ఉన్నారని, హైకమాండ్ ఆదేశిస్తే అందరి సహకారంతో ఎన్నికల్లో నిలిచేందుకు అభ్యంతరం లేదని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.