భవనాలు నిర్మించకుండానే 2 కోట్లు డ్రా

ఆంధ్రా విద్యాలయంలో సొసైటీ నిర్వాకం

ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: చారిత్రక ఆంధ్రా విద్యాలయంలో భవన నిర్మాణాలు చేయకుండా రికార్డుల్లో చేసినట్లుగా చూపించి రూ.2 కోట్లకు పైగా స్వాహా చేశారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రా విద్యాలయం ఎడ్యుకేషన్‌ సొసైటీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఓయూ విద్యార్థి నాయకుడు జె.శంకర్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు విచారించింది.

పిటిషనర్‌ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ప్రతివాదుల్ని ఆదేశించింది. తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, కాలేజీ విద్యా శాఖ కమిషనర్, ఏవీ ఎడ్యుకేషన్‌ సొసైటీ కార్యదర్శి, అకౌంట్‌ జనరల్‌ ప్రిన్సిపాల్, ఏవీ కాలేజీ ఆర్ట్స్, సైన్స్‌ అండ్‌ కామర్స్‌ ప్రిన్సిపాల్స్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామని తెలిపింది.  

అక్రమాలపై కాగ్‌ నివేదిక..
ఏవీ ఎడ్యుకేషన్‌ సొసైటీని 1944లో దోమల్‌గూడలోని గగన్‌మహల్‌లో రాజ బహుదూర్‌ వెంకటరామారెడ్డి, సురవరం ప్రతాప్‌రెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటి మహనీయులు ఏర్పాటు చేశారని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు.

ఏవీ ఎడ్యుకేషన్‌ సొసైటీ అక్రమాలకు పాల్పడుతోందని అధికారులకు ఫిర్యా దుచేసినా ఫలితం లేకపోయిందని, ఇప్పుడు సొసైటీ అక్రమాలపై కంట్రోల్‌ ఆఫ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) సైతం నివేదిక ఇచ్చిందన్నారు. సొసై టీపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.  వాదనలు విన్న ధర్మాసనం ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రతివాదుల్ని ఆదేశించింది.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top