
సర్కారుపై సమరం
ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నిర్ణయించింది.
♦ టీపీసీసీ సమన్వయ కమిటీ, విస్తృతస్థాయి భేటీలో నిర్ణయం
♦ హామీల అమలు కోసం క్షేత్ర స్థాయిలో ఉద్యమం
♦ టీపీసీసీ నేతలకు పని విభజన.. శిక్షణా శిబిరాలు
♦ మరింత క్రియాశీలకంగా క్రమశిక్షణా సంఘం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నిర్ణయించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే దాకా గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం, సమన్వయ కమిటీ భేటీ జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, కార్యదర్శి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లాల వారీగా పని విభజన, ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు, హామీల అమలు కోసం క్షేత్రస్థాయిలో చేయాల్సి పోరాటాలు వంటి వాటిపై సమావేశంలో సుదీర్ఘం గా చర్చించారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వివరించారు. జిల్లాకు ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారని చెప్పా రు. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీల పునర్‌వ్యవస్థీకరణ, టీఆర్‌ఎస్ హామీల అమలుపై పోరాటాల పర్యవేక్షణ, పార్టీ వ్యవహారాలకు వీరు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారన్నారు.
పార్టీ శ్రేణులకు శిక్షణా శిబిరాలు
గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీ శ్రేణులకు శిక్షణ శిబిరాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగాా ఉత్తమ్ వెల్లడించారు. కాంగ్రెస్ చరిత్ర, దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర, వర్తమాన రాజకీయ పరిణామాలు, పార్టీ వైఖరి వంటి వాటిపై ఈ శిక్షణ శిబిరాల్లో అవగాహన కల్పిస్తామని వివరించారు. టీపీసీసీ క్రమశిక్షణా సంఘం పాత్రను మరింత క్రియాశీలకంగా, కఠినంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ైరె తుల సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికార టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా, కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న నమస్తే తెలంగాణ, టీ న్యూస్ చానెల్‌ను బహిష్కరించాలని నిర్ణయించినట్టుగా ఉత్తమ్ తెలిపారు. ఇకపై వాటిలో వచ్చే కథనాలను కాంగ్రెస్ శ్రేణులు పట్టించుకోవద్దని సూచిం చారు. ఆ వార్తాసంస్థలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని పేర్కొన్నారు.
ఎంత పెద్దవారైనా రీఎంట్రీకి నో
అధికారం ఉన్నంతకాలం పెద్దపెద్ద పదవులను అనుభవించి, అధికారం పోగానే కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోయిన నాయకులను తిరిగి రానివ్వొద్దని పలువురు నాయకులు ఈ సమావేశంలో సూచించారు. పార్టీని వీడిన వారు ఎంత పెద్దవారైనా పార్టీలోకి తిరిగి తీసుకోవద్దని కోరారు. పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిపై వెంటనే క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలన్నారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పోరాటం చేయాలని, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, కరువు విషయంలో ప్రజల కష్టాలపైనా నిలదీయాలని పలువురు నేతలు సూచించారు.