
నీటి పంచాయితీ తేలేనా..!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల పంచాయితీని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
* 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఖరారు
* ఎజెండాపై ఇరు రాష్ట్రాలతో చర్చించిన కేంద్ర జలవనరుల శాఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల పంచాయితీని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన తెలంగాణ, ఏపీ సీఎంలు సభ్యులుగా ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశం ఈ నెల 21న మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని ‘శ్రమశక్తి భవన్’లో నిర్వహించనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలంటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్రం శుక్రవారం నోటీసులు పంపనుంది. తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శులు ఎస్.కె. జోషీ, శశిభూషణ్ కుమార్‌లతో గురువారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర జలనవరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్‌సింగ్ ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ ఎజెండాను ఖరారు చేశారు.
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులతోపాటు గోదావరి బేసిన్‌లో చేపట్టిన ప్రాజెక్టుల వివాదాలపైనా అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించాలని నిర్ణయించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 120 టీఎంసీలు తరలించేందుకు తెలంగాణ సర్కార్ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయాలంటూ ఏపీకి చెందిన రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా నెల రోజుల్లోగా అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించాలని జూలై 20న సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు కేంద్ర జలవనరుల శాఖ సిద్ధమైంది. విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే జల వివాదాలను పరిష్కరించేందుకు ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84 (2) ప్రకారం కేంద్ర జలవనరులశాఖ మంత్రి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది.
పోటా పోటీగా ఫిర్యాదులు...
దేశంలో సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖల కార్యదర్శులతో గురువారం ఢిల్లీలో సమీక్షించిన అమర్జీత్ సింగ్...ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్‌పై తెలుగు రాష్ట్రాల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల కార్యదర్శులు ఆయనకు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు. ఏపీ సర్కార్ అనుమతుల్లేకుండానే ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వుతోందని, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్.కె. జోషీ ఫిర్యాదు చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 90 టీఎంసీల గోదావరి జలాల్లో 45 టీఎంసీలు, పోలవరం ద్వారా డెల్టాకు మళ్లించే నీటిలో 45 టీఎంసీల వాటా తెలంగాణకు ఇవ్వాలని కోరారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ సర్కార్ కేటాయించిన నీటి కన్నా అధికంగా వినియోగిస్తోందన్నారు. మరోవైపు గోదావరి నదీ జలాల వినియోగంపై మహారాష్ట్రతో తెలంగాణ చేసుకున్న ఒప్పందాలపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశి భూషణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. కృష్ణా బేసిన్‌లోని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపు, మిషన్ భగీరథ సహా గోదావరి బేసిన్‌లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పైనా ఫిర్యాదు చేశారు. వీటిని పరిశీలించిన అమర్జీత్ సింగ్ కృష్ణాతో పాటు, గోదావరి ప్రాజెక్టులపైనా అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించేలా ఎజెండా ఖరారు చేశారు. కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీల మధ్య పునఃపంపిణీ చేయాలని ఇరు రాష్ట్రాలు కోరగా దీనిపైనా అపెక్స్ భేటీలో చర్చిద్దామని అమర్జీత్ సింగ్ హామీ ఇచ్చినట్లుగా తెలిసింది.