జికా వైరస్‌పై అలర్ట్

జికా వైరస్‌పై అలర్ట్ - Sakshi


♦ రాష్ట్ర వ్యాప్తంగా రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటుకు సన్నాహాలు

♦ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మెడికల్ టీమ్స్

♦ దోమల నివారణకు రాష్ట్ర వైద్య యంత్రాంగం ప్రత్యేక చర్యలు

 

 సాక్షి, హైదరాబాద్: దోమను చూస్తే జనం వణికిపోతున్నారు. జికా వైరస్ సోకుతుందేమోనని బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో దోమల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ప్రపంచంలో 22 దేశాల్లో జికా వైరస్ ప్రబలడం, ఆసియా ఖండంలో మొదటి కేసు చైనాలో నమోదు కావడం, జికా వైరస్ విజృంభణ కారణంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. జికా వైరస్ సోకకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.



ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ స్పందించి రాష్ట్రవ్యాప్తంగా రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్(ఆర్‌ఆర్‌టీ)ను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. ఆర్‌ఆర్‌టీలో ఒక అంటువ్యాధుల నిపుణుడు, ప్రజారోగ్య స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, మెడికల్ లేదా పీడియాట్రిక్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ ఉండేలా చూడాలని సూచించింది.  హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకటి, రెండురోజుల్లో  వైద్య బృందాలను ఏర్పాటు చేయనుంది. విద్య, పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమం, మున్సిపల్, గిరిజన, పరిశ్రమలు తదితర శాఖల అధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి జికా సోకకుండా చర్యలు తీసుకోనుంది. అయితే, జికా వైరస్ వల్ల వచ్చే వ్యాధి నివారణకుగాని, తగ్గించడానికిగాని ప్రత్యేక వ్యాక్సిన్, మందు అందుబాటులో లేవని స్పష్టం చేసింది.

 

 జికా సోకిన వ్యక్తి లక్షణాలు

 జికా వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, కండ్లకలక వంటి లక్షణాలుంటాయి. నవజాత శిశువులు, గర్భిణులు, న్యూరోలాజికల్ సమస్యలున్నవారికి ఇది త్వరగా సోకుతుందని కేంద్రం తెలిపింది. షుగర్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, రోగ నిరోధకశక్తిలేనివారు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అయితే, తెలంగాణలో కంగారు పడాల్సిన పనిలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అంటువ్యాధుల విభాగం జాయింట్ డెరైక్టర్ డాక్టర్ డి.సుబ్బలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top