6 రోజుల్లో 5.5 కోట్ల మొక్కలు | 5.5 million plants in 6 days | Sakshi
Sakshi News home page

6 రోజుల్లో 5.5 కోట్ల మొక్కలు

Jul 14 2016 1:00 AM | Updated on Nov 9 2018 5:56 PM

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమస్ఫూర్తితో సాగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంగా సాగుతున్న హరితహారం
- ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 71 లక్షల మొక్కలు నాటిన ప్రజలు
ఏరోజుకారోజు సమీక్షిస్తున్న సీఎస్... సీఎంకు నివేదిక
 
 సాక్షి, హైదరాబాద్ : ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమస్ఫూర్తితో సాగుతోంది. సీఎం  కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపునకు స్పందించి స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, యాజమాన్యాలు, ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల ఉద్యోగులు, అధికారులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 8న కార్యక్రమం మొదలైనప్పటి నుంచి 12వ తేదీ (మంగళవారం) వరకు ప్రజలు 4.42 కోట్ల మొక్కలను నాటినట్లు అధికారిక లెక్కలు విడుదలవగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కోటికిపైగా మొక్కలను నాటినట్లు అంచనా.

 అడవుల జిల్లాలోనే అత్యధికంగా...
 అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం నాటికి అత్యధికంగా 61.54 లక్షల మొక్కలను నాటారు. బుధవారం మరో పది లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో 50.84 లక్షల మొక్కలు రంగారెడ్డి జిల్లా పరిధిలో మంగళవారం నాటికి 2.65 కోట్ల మొక్కలు, జీహెచ్‌ఎంసీలో 19.36 లక్షలు, హెచ్‌ఎండీఏ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో 2.55 లక్షల మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో హరితహారం లక్ష్యాల మేరకు సాగడం లేదు. కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల్లో గత మూడు రోజులుగా ఆశించిన స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం జరగలేదని అధికారులు చెబుతున్నారు.

 ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
 ‘తెలంగాణకు హరితహారం’లో ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటి కొత్త రికార్డు సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాల్లో హరితహారం సాగుతున్న తీరుపై ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ ఏరోజుకారోజు కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకొని పర్యవేక్షిస్తున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement