వెయ్యి శాంపిళ్లలో 200 బీజీ–3 విత్తనాలే | 200 bg-3 seeds in 1000 samples | Sakshi
Sakshi News home page

వెయ్యి శాంపిళ్లలో 200 బీజీ–3 విత్తనాలే

May 5 2018 1:35 AM | Updated on May 5 2018 1:35 AM

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజీ–3 దందా జోరుపై కేంద్రం విస్మయం వ్యక్తం చేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అధికంగా ఈ రకం విత్తనం వెలుగుచూసినట్లు అంచనా వేసినట్లు తెలిసింది. బీజీ–3 పత్తి విత్తన సాగు రాష్ట్రంలో ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు నాలుగు నెలల క్రితం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నిపుణుల బృందం.. అనంతరం కేంద్రానికి నివేదిక ఇచ్చింది.

బీజీ–3 విత్తనంపై రెండ్రోజుల కిందట ఢిల్లీలో సమావేశమైన క్షేత్రస్థాయి తనిఖీ, మూల్యాంకన పరిశోధన కమిటీ(ఎఫ్‌ఐసీఐసీ)లో ఈ అంశం చర్చకు వచ్చింది. దేశవ్యాప్తంగా 15 శాతం బీజీ–3 విత్తనాలుంటే.. రాష్ట్రంలో 20% వరకు ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిసింది. వెయ్యి పత్తి విత్తన శాంపిళ్లను తీసుకెళ్లి పరీక్షిస్తే, అందులో 200 బీజీ–3 విత్తనాలున్నట్లు నిర్ధారించినట్లు రాష్ట్ర వ్యవసాయ వర్గాలు తెలిపాయి.  

ఉక్కుపాదం మోపేందుకు కమిటీ..
బీజీ–3 విత్తనాన్ని షరతులతో అనుమతించాలని తెలంగాణలోని కొన్ని పత్తి విత్తన కంపెనీలు వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బీజీ–2లో పది శాతం మేరకు బీజీ–3 విత్తనాలు కలిపేందుకు అవ కాశం ఇవ్వాలని, ఆ మేరకు ఢిల్లీ సమావేశంలో ప్రస్తావించాలని కంపెనీలు కోరినట్లు ప్రచారం జరిగింది. బీజీ–3 పత్తి విత్తనం అడ్డాగా తెలంగాణ ఉందనే విషయంపై ‘సాక్షి’అనేక కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే.

ఆ కథనాలను ఢిల్లీలోని వ్యవసాయ ఉన్నతాధికారులు అనువాదం చేయించుకుని పరిశీలించినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కంపెనీల ప్రతిపాదనను అధికారులు కేంద్రం దృష్టికి తీసుకురాలేదని తెలి సింది. దేశవ్యాప్తంగా బీజీ–3 ఉన్నట్లు నిర్ధారణ జరిగినందున దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం తెలంగాణలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి బీజీ–3పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement