వంతెనలున్నాయ్...గుర్తుంచుకోండి! | 15 flyovers the Ganesh Immersion parade routes | Sakshi
Sakshi News home page

వంతెనలున్నాయ్...గుర్తుంచుకోండి!

Sep 14 2016 4:52 PM | Updated on Oct 16 2018 5:04 PM

వంతెనలున్నాయ్...గుర్తుంచుకోండి! - Sakshi

వంతెనలున్నాయ్...గుర్తుంచుకోండి!

గణేశ్ నిమజ్జన జరిగే ప్రధాన మార్గంలో 15 ఫ్లై ఓవర్లు ఉన్నాయి.

-ఊరేగింపు జరిగే మార్గాల్లో 15 ఫ్లైఓవర్లు
-ఇవి కాక మెట్రో పనులతో ఇబ్బందులు
-అధ్వాన రోడ్డులతో మరికొన్ని సమస్యలు
సాక్షి, సిటీబ్యూరో

నగరానికి సంబంధించి ప్రధాన నిమజ్జన రోజు ఏమాత్రం ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రక్రియ ఆగిపోయినా పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడానికి విగ్రహాల ఎత్తు కూడా ఓ కారణమయ్యే అవకాశం ఉంది. నగర వ్యాప్తంగా ప్రధాన ఊరేగింపులు జరిగే మార్గాల్లో 15 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు ఉన్నాయి. వీటి ఎత్తును, విగ్రహాల ఎత్తుతో పోల్చుకుని అందుకు తగ్గ ఊరేగింపు మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఊరేగింపు సమయంలో విగ్రహాలు వంతెనల వద్ద ఇరుక్కుపోయి తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్... ఒక్కోసారి శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. గణేష్ విగ్రహం వెళ్లే ఊరేగింపు మార్గంలోని వంతెనల కన్నా కనీసం 5 అడుగులు తక్కువగా విగ్రహం ఎత్తు ఉండాలి. వంతెన కింది నుంచి ఉన్న రోడ్డు దగ్గర ఈ ఎత్తును పరిగణలోకి తీసుకుంటారు. ‘గణేష్’ని తీసుకువెళ్లే వాహనం (లారీ, వ్యాన్ తదితరాలు) ఎత్తు గరిష్టంగా 5 అడుగులు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విగ్రహం ఎత్తు వంతెన కంటే కనిష్టంగా 5 తక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా సరిపోయే ఊరేగింపు మార్గాన్ని మండపాల నిర్వాహకులు ఎంపిక చేసుకోవాలి. ముందుగా మీరు అనుకున్న మార్గంలో ఉండే ఈ ‘అవాంతరాలను’ పరిగణలోకి తీసుకుని అవసరమైతే ప్రత్యామ్నాయాలు ఎంపిక చేసుకుంటే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కీలక ఘట్టం ముగుస్తుంది. వీటికి తోడు ఈసారి ‘మెట్రో మార్గం’లో పిల్లర్ల నిర్మాణాలు, సాయిల్ టెస్ట్‌లు, ఇతర పనులు జరుగుతున్న విషయాన్నీ నిర్వాహకులు గుర్తుంచుకోవాలి.

‘మెట్రో’తో బహుపరాక్:
పోలీసు విభాగం గణేష్ విగ్రహాల ఎత్తుపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ప్రస్తుతం నగరంలో చాలా చోట్ల మెట్రో రైల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు కొన్ని చోట్ల కొత్తగా మెట్రో స్టేషన్లు వచ్చాయి. వీటన్నింటినీ నిర్వాహకులు దష్టిలో పెట్టుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ప్రధానంగా ఎంజే మార్కెట్ మీదుగా 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాలు వెళ్ళడం కష్టసాధ్యం. వీటిని మండప నిర్వహకులు దష్టిలో పెట్టుకుని, ముందుగానే వారు ఊరేగింపు వెళ్లే దారిని ఎంచుకోవాల్సి ఉంటుంది. విగ్రహము ఎత్తుతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఎలాంటి సహాయసహకారాలు కావాలన్నా హెల్ప్‌లైన్ లేదా కంట్రోల్‌రూం, స్థానిక పోలీసుల్ని సంప్రదించాలి.

రోడ్లపై ఓ కన్నేసి ఉంచాల్సిందే..:
గడిచిన రెండుమూడు రోజులుగా కురిసిన వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఏమాత్రం విరామం లేకుండా రోజూ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆయా మార్గాలను మరమ్మతు చేయడం సైతం పూర్తిస్థాయిలో సాధ్యం కాదు. అయితే ఇలాంటి రహదారుల వల్ల ఊరేగింపునకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. భారీ విగ్రహాలతో వస్తున్న లారీల టైర్లు ఈ గుంతల్లో పడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్స్‌తో పాటు ప్రమాదాలకూ ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే నగర పోలీసులు ఎక్కడికక్కడ సెక్టార్లుగా విభజించుకుని ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్వాహకులు, ఊరేగింపులో ఉండే వారు సైతం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అప్రమత్తంగా ఉండే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement