
అవగాహన లేకపోతే ఇబ్బందులే
అసలేదో... నకిలీ ఏదో తెలియక విశ్వవిద్యాలయాల ఎంపికలో భారత విద్యార్థులు అమెరికాలో తప్పటడుగులు వేస్తున్నారు.
అమెరికాలో విద్యపై ‘యూఎస్-ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ ప్రతినిధి
హైదరాబాద్: అసలేదో... నకిలీ ఏదో తెలియక విశ్వవిద్యాలయాల ఎంపికలో భారత విద్యార్థులు అమెరికాలో తప్పటడుగులు వేస్తున్నారు. అక్కడి విద్యావిధానం, విద్యా సంస్థలపై సరైన అవగాహన లేక... నిలువునా నష్టపోయి బిక్కముఖంతో తిరుగు ప్రయాణమవుతున్నారు. విదేశాల్లో చదువుకోవాలనే తపన మాత్రమే ఉంటే సరిపోదు. అక్కడి వర్సిటీల అర్హతలు... వాటిల్లో అందిస్తున్న కోర్సుల గురించి ముందుగానే క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఫీజు తక్కువని ఏ ఆలోచనా లేకుండా చేరిపోతే తరువాత బాధపడాల్సి వస్తుందంటున్నారు ‘యూఎస్-ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ భారత సమన్వయకర్త రేణుకారాజారావు. అమెరికాలోని విద్యావిధానంపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.
ఎలాంటి ప్రణాళిక అవసరం?
చాలామంది అరకొర సమాచారంతోనే అమెరికా వెళ్తున్నారు. ఆ వర్సిటీల స్థాయి, కోరుకున్న కోర్సుకు సంబంధించిన వివరాలు, పరిశోధనలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణన లోనికి తీసుకోవడం అత్యంత ప్రాధాన్యం.
మీ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు?
ఆరు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ ఫౌండేషన్ దాదాపు 170 దేశాల్లో 450 కేంద్రాల్లో సేవలు అందిస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్‌లలో ప్రాంతీయ కేంద్రాలున్నాయి. హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సులేట్‌లోనే ఈ కేంద్రం అందుబాటులో ఉంది. వీటిల్లో అమెరికా విద్యకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం, మార్గనిర్దేశనం దొరుకుతుంది.
సమాచారం ఎక్కడ లభిస్తుంది?
www.educationusa.state.gov, www.usief.org.inలలో గానీ సోమవారం నుంచి శుక్రవారం వరకు (మ.గం.2- సా.గం.5) 18001031231 టోల్ ఫ్రీ నెంబర్‌లో గానీ సంప్రదించవచ్చు. హైదరాబాద్‌లో సోమాజీగూడ సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల ఆవరణలోని అమెరికన్ కార్నర్‌లో ఉన్న గ్రంథాలయంలో అమెరికా విద్యకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాం.
విద్యాభ్యాసానికి అక్కడ ఏ సమయం అనుకూలం?
సాధారణంగా అక్కడ ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది.
అమెరికా వెళ్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి?
విద్యా సంస్థల గుర్తింపు నిర్థారించుకోకుండా వెళ్లడం వల్ల విద్యార్థుల లక్ష్యానికి మధ్యలోనే బ్రేక్ పడుతోంది. ఒక వేళ గుర్తింపు ఉన్న ఏదో ఒక వర్సిటీని ఎంపిక చేసేసుకున్నా... అక్కడ సరైన ప్రమాణాలు, ఫ్యాకల్టీ లేక నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. ఆర్థిక ప్రణాళిక లేకుండా వెళ్తుండడంతో మధ్యలోనే వెనుదిరిగి వస్తున్నారు. అమెరికాలో ఓపెన్ డోర్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచదేశాల నుంచి ఏటా అమెరికాకు రూ.10 లక్షల మంది విద్యార్థులు వెళ్తుంటే వారిలో 1.32లక్షల మంది భారత్‌కు చెందినవారే.
పార్ట్‌టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుకోవచ్చా?
అలా అనుకుంటే పొరపడినట్లే. వర్సిటీల అంగీకారం మేరకు వారానికి 20 గంటలు మాత్రమే పార్ట్‌టైమ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ప్రాక్టికల్‌గా చూస్తే 10 గంటలు మాత్రమే చేసే వెసులుబాటు ఉంది. దీని ద్వారా 8-12 డాలర్స్ సంపాదిస్తారే తప్ప చదువు ఫీజులు, అద్దెలు చెల్లించలేరన్న విషయాన్ని గమనించాలి.