విపక్ష ఎంపీలకు గౌరవం ఇవ్వడం లేదు | Opposition MPs To Not giving respect | Sakshi
Sakshi News home page

విపక్ష ఎంపీలకు గౌరవం ఇవ్వడం లేదు

Jul 21 2015 1:13 AM | Updated on Mar 9 2019 3:08 PM

విపక్ష ఎంపీలకు గౌరవం ఇవ్వడం లేదు - Sakshi

విపక్ష ఎంపీలకు గౌరవం ఇవ్వడం లేదు

కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఎంపీలకు సరైన గౌరవం ఇవ్వడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమత్రా మహాజన్ దృష్టికి తీసుకెళ్లారు.

లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ మేకపాటి
 
*  ప్రజావ్యతిరేక బిల్లులకు మద్దతివ్వబోమని స్పష్టీకరణ
 
*  పొగాకు రేటు పెంచాలని కేంద్ర మంత్రి వెంకయ్యకు విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఎంపీలకు సరైన గౌరవం ఇవ్వడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమత్రా మహాజన్ దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలపై కార్పొరేటర్ల పేర్లు వేస్తున్నారు కానీ, ఎంపీల పేర్లను పెట్టడంలేదని చెప్పారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలను పురస్కరించుకుని స్పీకర్ సుమిత్రా మహజన్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయడు సోమవారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ప్రొటోకాల్ విషయంపై ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష ఎంపీలకు గౌరవం ఇచ్చేలా రాష్ట్రాలు, జిల్లా కలెక్టర్లకు సలహా ఇవ్వాలని కోరారు. గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో చనిపోయిన వారికే కాకుండా, పుష్కరాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చనిపోయినవారికి కూడా పార్లమెంటులో నివాళులర్పించాలని స్పీకర్‌ను కోరారు.

అనంతరం ఎంపీ మేకపాటి విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులకు సహకరిస్తామని, ప్రజా వ్యతిరేక బిల్లులను సమర్థించబోమన్నారు. భూసేకరణ బిల్లు విషయంలో మూడు అంశాలను వివరించామన్నారు. బాగా పంటలు పండే సారవంతమైన భూములను సేకరించడానికి తాము వ్యతిరేకమని, రైతుల ఆమోదయోగ్యం లేకుండా, సామాజిక ప్రభావం అంచనా వేయకుండా భూసేకరణ చేయకూడదని స్పష్టం చేశామని తెలిపారు.

ఈ మూడు అంశాలను సవరిస్తే భూసేకరణ బిల్లుకు మద్దతు ఇస్తామన్నారు. ముఖ్యమైన బిల్లుల విషయంలో ప్రజా ప్రయోజనాల మేరకు అంశాల వారీగా సమర్థిస్తామని, ఈ విషయాన్ని మా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముందునుంచి చెబుతున్నారన్నారు. ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాల్లో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పొగాకు సేకరణలో గతేడాది వచ్చిన రేటులో సగం రేటుకూడా రావడంలేదని, రేటు పెంచాలని మంత్రి వెంక య్య దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

ఎంపీ ల్యాడ్ నిధుల విషయమై మాట్లాడుతూ .. నెల్లూరు జిల్లాలో సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న గ్రామానికి రూ. 3 కోట్లు, కలెక్టరు రూ. 3 కోట్లు ఇచ్చారని, కానీ ఎంపీలకు ఇచ్చేది రూ. 5 కోట్లేనని, ఇప్పటికైనా ఎంపీల్యాడ్ కింద నిధులు పెంచాలని కోరామన్నారు. టీడీపీ నుంచి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఫ్లోర్ లీడర్ తోట నరసింహం అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement