నిరసన వెనుక దాగిన సత్యం

what truth behind Supreme Judges Protest - Sakshi

ఈ నలుగురు న్యాయమూర్తులు.. ఎమర్జెన్సీ నాటి జడ్జీల్లా కాకుండా, తమ ఆత్మలను తాము అమ్మివేసిన ఆరోపణకు గురికావద్దని నిశ్చయించుకున్నారు. కానీ న్యాయవ్యవస్థ, రాజ్యాంగ క్రమం అనేవి జడ్జీలపైనే ఆధారపడి ఉండవు. అంతిమంగా అవి పౌరులందరి అప్రమత్తతపైనే ఆధారపడి ఉంటాయి.

సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం అసలు సంక్షోభమే కాదన్న విషయంలో కాస్త స్పష్టత కలిగి ఉందాం. ఇది న్యాయస్థాన పరిధిని దాటి బట్టబయలైన ఉన్నత న్యాయమూర్తుల మధ్య వ్యక్తిగత పెనుగులాట కాదు. ఇది జడ్జి లోయా కేసును, అలాంటి మరి కొన్ని కేసులను ఎవరు విచారించాలన్న అంశానికి సంబంధించిన వివాదం కాదు. ఇది సుప్రీంకోర్టు రోస్టర్‌ని నిర్ణయించే అధికారం, విధి విధానాలకు చెందిన సాంకేతిక వివాదం కూడా కాదు. ఇది మన అత్యున్నత న్యాయస్థానాన్ని ఎత్తిచూపుతున్న తీవ్రమైన అవినీతి ఆరోపణ గురించిన సమస్య కూడా కాదు. వాస్తవానికి ఇది న్యాయవ్యవస్థ అంతర్గత వివాదానికి సంబంధించిన సమస్య కానే కాదు.

నిస్సందేహంగా ఇది ఈ సంక్షోభంలో అదృశ్యంగా ఉండి వెనుకనుంచి వ్యవహారం నడుపుతున్న ఒక పాత్రధారికి చెందిన సమస్య. అదెవరో కాదు మోదీ ప్రభుత్వమే. ఇది న్యాయవ్యవస్థకు, కార్యనిర్వాహక వర్గానికి మధ్య సంబంధాలకు చెందిన సమస్య. ఇది సుప్రీంకోర్టు బెంచ్‌ని ఫిక్స్‌ చేయడం ద్వారా తేలిగ్గా వంగిపోయే న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకునే ప్రభుత్వ ప్రయత్నానికి సంబంధించిన సమస్య. ఎమర్జెన్సీకి ముందు, నాటి ప్రధాని ఇందిరా గాంధీ అలా డిమాండ్‌ చేయటమే కాదు, ప్రభుత్వానికి మద్దతునిచ్చే తరహా న్యాయవ్యవస్థను దాదాపుగా సాధించుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రాజీ పడిపోయిన న్యాయవ్యవస్థ ద్వారా ఇదే లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నిస్తోంది. నలుగురు న్యాయమూర్తుల నిరసన... ఈ ప్రాజెక్టులో మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న చివరి కీలకమైన ఆవరోధం కావచ్చు.

చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఏ పరిణామానికైనా తోడుగా వచ్చే పుకార్లకు మనం లోనుకాకుండా ఉందాం. జడ్జీలు వారి ఉద్దేశాల మధ్య సంబంధంపై మీడియా, న్యాయవాదులు తీవ్ర అంచనాలు కడుతుం టారు. నిజానికి ఏ మానవ కార్యాచరణ అయినా సరే.. అసూయ, అత్యాశ, అహంభావం అనే లక్షణాలకు దూరంగా ఉండదు. కానీ న్యాయవ్యవస్థ సమగ్రతకు ప్రతిరూపంగా పేరుపడిన నలుగురు న్యాయమూర్తులు కనీవినీ రీతిలో చేపట్టిన సామూహిక చర్య ఇలాంటి అల్పమైన అంశాలకు పరిమితమై ఉండదు. ఈ నలుగురిలో ఏ ఒక్కరూ దీనివల్ల లబ్ధి పొందకపోగా, తమ చర్యకు గానూ ప్రతిదాన్నీ నష్టపోవలసి ఉంటుంది. జస్టిస్‌ గొగోయ్‌ తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా పదవిని చేపట్టే అవకాశం కోల్పోయే ప్రమాదముంది. ఇక మిగిలిన ముగ్గురు జడ్జీలు చాలామంది రిటైర్డ్‌ జడ్జీలు చేజిక్కించుకునే పదవీ విరమణ అనంతర ప్రయోజనాలను కోల్పోవచ్చు కూడా. పైగా, వీరి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ భారీ కుట్ర ద్వారా పకడ్బందీగా కాకుండా అకస్మిక ఘటనగా పరిణమించింది. కాబట్టి వీరు తమ అంతరాత్మ ప్రబోధానుసారమే మాట్లాడారనే విషయాన్ని మనం నమ్మకుండా ఉండాల్సిన పనిలేదు. ఏ సందర్భంలోనైనా వారు రాజీపడాలనుకుని ఉంటే, రాజ్యాంగ బెంచ్‌ నుంచి వారిని మినహాయించే పనిని చీఫ్‌ జస్టిస్‌ తలపెట్టి ఉండకపోవచ్చు కూడా.

సుప్రీం జడ్జీలు తమ అసమ్మతి వ్యక్తం చేయడానికి ఇది సరైన మార్గమేనా అనే వివాదంలో మనం చిక్కుకోకుండా జాగ్రత్త పడదాం. నిజం గానే న్యాయమూర్తులు మీడియా ద్వారా కాకుండా, వారి తీర్పుల ద్వారానే మాట్లాడాలని అందరూ భావిస్తారు. కానీ మన జడ్జీలు ఈ సమస్య ప్రజల దృష్టికి తప్పక తీసుకుపోయి తీరవలసిన అంశంగా ఆలోచించారు. జాతి రుణాన్ని తీర్చుకుంటున్నామని చెప్పడం ద్వారా వారు దాన్నే సూచించి ఉంటారు. అయితే పథకం ప్రకారం అల్లిన కథలు, లీక్‌ చేసిన ఉత్తరాలు వంటి నిజాయితీ రహిత రూపంలో కాకుండా బహిరంగంగా ప్రజల ముందే తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించినందుకు వీరికి మనం నిజంగానే కృతజ్ఞత తెలపాలి. 

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రోస్టర్‌ని ఎవరు, ఎలా నిర్ణయించాలి అనే సాంకేతిక వివాదానికి మనం పరిమితం కావద్దు. ప్రస్తుత ఏర్పాటు ప్రకారం ప్రధాన న్యాయమూర్తే రోస్టర్‌ని నిర్ణయిస్తారనడంలో వివాదమే లేదు. కానీ కోర్టులు ప్రతిరోజూ బడాబాబులకు చెబుతున్న– అవును, మీకు అధికారముంది, కానీ దాన్ని మీరు ఇష్టమొచ్చినట్లుగా ఉపయోగించకూడదు– అనే మాటలను  చీఫ్‌ జస్టిస్‌ గుర్తుంచుకోవలసిన అవసరముంది. న్యాయవ్యవస్థకు కూడా కొన్ని విధి విధానాలు, సంప్రదాయాలు, ప్రమాణాలు ఉన్నాయి. తీవ్రమైన, సున్నితమైన అన్ని కేసులనూ సీనియర్‌ జడ్జీలకే ఇవ్వాలని ఎవరూ చెప్పడం లేదు. ఉన్న అభ్యం తరమల్లా ఏమిటంటే, కొందరు అగ్రశ్రేణి లేదా అనుకూలంగా ఉండని జడ్జీలను ప్రభుత్వ ప్రయోజనాలతో ముడిపడిన కేసులనుంచి పద్ధతి ప్రకారం దూరం పెట్టడం లేదా తొలగించడమే. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆదేశాలమేరకు ఇద్దరు లేదా ముగ్గురితో కూడిన చిన్న బెంచ్‌లతో నడుస్తోంది. చీఫ్‌ జస్టి్టస్‌ చలాయిస్తున్న ఈ అధికారమే కేసును తేల్చేస్తుంది లేక అడ్డుకుంటుంది. అందుకే ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చీఫ్‌ జస్టిస్‌ను ప్రసన్నుడిని చేసుకోవాలని లేదా గట్టిగా నొక్కి పట్టుకోవాలని భావిస్తూండవచ్చు. 

అందుచేత, జడ్జి లోయా కేసుకు మాత్రమే మన దృష్టిని పరిమితం చేయవద్దు. నిజంగానే ఇది చాలా కీలకమైన కేసు, దేశంలోనే రెండో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తిని ఇది చిక్కుల్లో పెట్టగలదనడంలో సందేహం లేదు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారం ప్రస్తుతానికి సందేహా స్పదంగా ఉంది. అది తన తార్కిక ముగింపునకు చేరుకోవాల్సి ఉంది. కానీ అసమ్మతి తెలుపుతున్న నలుగురు జడ్జీలు ఈ కేసునే కాక, ఇటీవలి గతానికి చెందిన ఇతర కేసులను కూడా ఎత్తి చూపుతున్నారు. ఈ ఏడాది తమ ముందుకు రానున్న కేసుల గురించి వారు ఆందోళన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సందర్భంగా అయోధ్య వివాదంతో సహా కొన్ని కేసుల ఫలితాల మీద పాలకపార్టీ ఎన్నికల వ్యూహం ఆధారపడి ఉండబోతోంది. అందుకే మునుపెన్నటి కంటే కేంద్రప్రభుత్వానికి ఇప్పుడు స్నేహపూర్వకంగా ఉండే చీఫ్‌ జస్టిస్‌ కావాలి.

ఈ నలుగురు న్యాయమూర్తులు– జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ గోగోయ్, జస్టిస్‌ లోకుర్, జస్టిస్‌ మాథ్యూలు ఎమర్జెన్సీ నాటి జడ్జీలలా కాకుండా, తమ ఆత్మలను తాము అమ్మివేసిన ఆరోపణకు గురికావద్దని స్పష్టపర్చుకున్నారు. కానీ న్యాయవ్యవస్థ, రాజ్యాంగ క్రమం అనేవి కేవలం జడ్జీలపై ఆధారపడి ఉండవు. అంతిమంగా అవి పౌరులందరి అప్రమత్తతపైనే ఆధారపడి ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం జరుగుతున్న ఈ సమరంలో ప్రజలు కూడా తమ వంతు సన్నాహకాలకు సిద్ధంగా ఉండేలా చేయాలి.


యోగేంద్ర యాదవ్‌
వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యులు
మొబైల్‌ : 98688 88986

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top