ఆర్థికవేత్తల్లో ఇంత అయోమయమా?

Yogendra Yadav Article On Agriculture Bill - Sakshi

విశ్లేషణ

మూడు వ్యవసాయ బిల్లులను కేంద్రప్రభుత్వం ఆమోదింపచేసుకున్న నేపథ్యంలో.. పైకి ఎన్ని ఆకర్షణీయ మాటలను చెప్పినా, వ్యవసాయ మార్కెట్లను ప్రయివేటీ కరించడం ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగం నుంచి తప్పుకోబోతోందని రైతులు గ్రహిస్తున్నారు. ధాన్య సేకరణనుంచి, కనీస మద్ధతు ధరనుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గబోతోందని, సర్కారీ మండీల రద్దు ద్వారా తమ వ్యవసాయ రాబడులు మరింత అస్థిరతకు గురవుతాయని రైతులు అర్థం చేసుకుంటున్నారు. ఈ మూడుబిల్లులు తమ జీవితాలపై వేయబోతున్న ప్రభావాల గురించి పంజాబ్‌ రైతులు పోస్ట్‌ చేస్తున్న వీడియోలను గమనిస్తే అత్యుత్తమ వ్యవసాయ ఆర్థికవేత్తల కంటే భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ క్షేత్ర వాస్తవాలను రైతులే చక్కగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టంగా బోధపడుతుంది.

భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ ఆర్థికశాస్త్రవేత్తలలో ప్రొఫెసర్‌ అశోక్‌ గులాటి అగ్రగణ్యులు. పైగా నేను చదివి, సంప్రదించి, గౌరవించే పండితులలో ఆయన ఒకరు. రైతుల పట్ల నిజమైన ఆర్తి కలిగి ఉన్న మంచి మేధావి ఆయన. నరేంద్రమోదీ నేతృత్వంలో నడుస్తున్న నేటి ప్రభుత్వంతోపాటు ఏ ప్రభుత్వాలనైనా వ్యతిరేకించే దన్ను కలిగినవారు. అవసరమైతే రైతు ఉద్యమాలను కూడా వ్యతిరేకించే దమ్ము కూడా ఉంది. అనేక సంవత్సరాలు వ్యవసాయరంగంపై చేసిన కృషికి తోడుగా, ఆయన కేంద్రప్రభుత్వం ఇటీవల రూపొందించి ఆమోదింపజేసుకున్న మూడు నూతన వ్యవసాయబిల్లులను స్వాగతించారు. వీటిని భారతీయ వ్యవసాయానికి 1991 ఉద్యమం అని కూడా ఆయన పిలిచారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ది ప్రింట్‌ చీఫ్‌ ఎడిటర్‌ శేఖర్‌ గుప్తా సైతం నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా గులాటి వాదనలను యథాతథంగా ఉల్లేఖించారు.

విషాదకరమైన విషయం ఏమిటంటే గులాటి ఈ అంశంలో పూర్తిగా తప్పుచేశారు. ఇది పాక్షిక పాండిత్యానికి, తప్పుడు డేటాకు లేక పేలవమైన హేతువుకు సంబంధించిన తప్పిదం మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ విధాన సలహాదారుగా తన అనుకూలతా స్థానం ఫలితంగా నెలకొన్న విస్పష్టమైన తప్పు (ఆయన ఇప్పటికీ ప్రభుత్వ సలహాదారుగానే ఉన్నారా?). ఇద్దరు ఆర్థికవేత్తలు జీన్‌ డ్రెజ్, అశోక్‌ కొత్వాల్‌ మధ్య జరిగిన లోతైన చర్చను చదివినప్పుడు నాకు ఇది మరింత స్పష్టంగా అర్థమైంది. సబ్సిడీ ధరతో పేదలకు ఆహార పంపిణీ చేయడానికి నగదు బదిలీ చేయాలని కొత్వాల్‌ ఇచ్చిన సలహాకు స్పందనగా డ్రెజ్‌.. ప్రభుత్వానికి సలహా ఇచ్చే ఆర్థికవేత్తకు, పేదల పక్షాన సలహా ఇచ్చే ఆర్థికవేత్తకు మధ్య తేడా గురించి ఒక స్పష్టమైన విభజన రేఖ గీస్తూ మాట్లాడారు. ఒక విధాన సలహాదారు ప్రభుత్వానికి తాను ఇచ్చే సలహాలు పూర్తిగా మంచి స్ఫూర్తితో అమలవుతాయని అంచనా వేస్తూనే తన సలహాలు అందించే ప్రయోజనాలు ఏమిటనే విషయంపై తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంది.

ఒక విధానం పర్యవసానాలు ఏమిటి? వాస్తవ జీవితంలో ఆ విధానం క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతుంది అని పేదల పక్షం వహించే సలహాదారు తప్పక దృష్టి పెట్టాలి. పేదలకు సహాయం చేయడానికి ప్రత్యక్ష నగదు బదిలీ అనేది అత్యంత సమర్థవంతమైన, ఖర్చుతగ్గించే మార్గంగా కాగితంమీద బాగానే కనిపిస్తుందని, కానీ రేషన్‌ షాపుల ద్వారా ఆహార ధాన్యాల సరఫరా అనేది పేదలకు వాస్తవంగా వారి జీవితాలకు మేలు కలిగించే అంశంగా ఉంటుందని డ్రెజ్‌ నొక్కి చెప్పారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లుల విషయంలో కూడా ఇదే వాస్తవం.

సలహాదారులు–వ్యవసాయదారులు
ప్రొఫెసర్‌ గులాటి మాటల్లో చెప్పాలంటే ఈ బిల్లులు అత్యుత్తమమైనవి. ఈ చట్టాలు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి, కొనుగోలుదారులు వ్యవసాయ ఉత్పత్తులను కొని, నిల్వ చేసుకోవడానికి మేలైన అవకాశాన్ని, స్వేచ్ఛను కలిగిస్తున్నాయి. తద్వారా వ్యవసాయ మార్కెటింగ్‌లో పోటీని సృష్టించవచ్చు. మార్కెటింగ్‌ వ్యయాలను తగ్గించి, రైతులకు మెరుగైన ధరలను కల్పించడం, అదే సమయంలో వినియోగదారులు చెల్లించే ధరలను తగ్గించడం వైపుగా వ్యవసాయంలో మరింత సమర్థవంతమైన పంపిణీని సృష్టించడంలో ఈ పోటీ అనేది సహాయపడుతుంది అని గులాటి ఆ వ్యాసంలో చెప్పారు.  సైద్ధాంతిక మొండితనం కలిగిన వారు మినహా ఈ రకమైన సలహాలతో ఎవరు విభేదించగలరు? ఈ పోటీ వల్ల రైతులు కనీస మద్దతు ధరను పొందలేరంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రకటనల తప్పుడు ప్రచారానికి లోనవటం వల్లే ఈ బిల్లులను నిరసిస్తున్నారని స్వామినాథన్‌ అయ్యర్‌ రాస్తున్నారు.

ఈ వాదనలోని హేతువు ఏమంత చెడ్డది కాదు. కానీ క్షేత్రవాస్తవాలపై వీరి అంచనాలు షాక్‌ కలిగిస్తున్నాయి. పైగా ఈ చట్టాలు ఎలా అమలవుతాయి అనే అంశంపై వీరి అంచనాలు మంచి జరుగుతుందనే సద్భావనపైనే ఆధారపడ్డాయి. సహజంగానే వీరి నిర్ధారణలు చాలా తప్పు అని తేలుతుంది. ఆర్థిక శాస్త్రంలోని తికమకలను అర్థం చేసుకోలేని మన దేశ రైతు పైన పేర్కొన్న మేధావుల కంటే ఈ చట్టాలపై మరింత మెరుగైన అంచనాను కలిగి ఉంటాడు. మేఖలా కృష్ణమూర్తి వంటి ఆంత్రోపాలజిస్టు కానీ, సుధా నారాయణన్‌ వంటి క్షేత్రవాస్తవాలకు సమీపంగా ఉండే ఆర్థికవేత్త కానీ ఈ చట్టాలు వ్యవసాయ మార్కెట్లపై వేసే ప్రభావంపై మరింత వివేచనతో ఉంటారు.

సంస్కరణ–వాస్తవికత
రైతులకు వరాలు వాగ్దానం చేస్తున్నాయని చెబుతున్న ఈ చట్టాల గురించి నాలుగు అంచనాలను మనం పరిశీలిద్దాం. మొదటి అంచనా ఏమిటంటే సర్కారీ మండీలకు తప్పనిసరిగా తమ ఉత్పత్తులను అమ్మాల్సి వస్తున్నందున తమ పంటలను బయట అమ్ముకునేటప్పుడు వీరికి తగిన అనుభవం ఉండదన్నదే. ఇది తప్పు. ఎందుకంటే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో నాలుగింట ఒక భాగం మాత్రమే ఈ మండీల ద్వారా కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న ‘స్వేచ్ఛ’ను మన రైతుల్లో నాలుగింట మూడొంతుల మంది ఇప్పటికే ఆస్వాదిస్తున్నారు. రైతుల్లోని మెజారిటీకి ఇప్పుడు కావలసింది మండీల నుంచి స్వేచ్ఛ కాదు. మరింత చక్కగా నిర్వహించే మండీలు వారికి అవసరం. గత కొన్నేళ్లుగా విస్తృతంగా రైతులతో సమావేశమవుతూ వస్తున్న నేను రైతులు పదేపదే ఒక అంశంపై ఫిర్యాదు చేయడం గమనించాను. తమకు అందుబాటులో మండీలు లేవని, ఉన్నా సరైనరీతిలో అవి పనిచేయడం లేదని రైతులు ఆరోపించారు.

రెండో అంచనా ఏమిటంటే, కమిషన్‌ ఏజెంట్ల నుంచి ఈ చట్టాలు రైతులను కాపాడతాయన్నదే. ఇది కూడా తప్పే. మండీలు రైతులను మోసగించలేవని చెప్పలేం కానీ వేలాదిమంది రైతులతో నేరుగా సంప్రదించలేని బడా వ్యవసాయ కంపెనీలు నెలకొల్పే ప్రైవేట్‌ మండీలకు ఈ సర్కారీ మండీల నిర్వహణదారులు తమ సేవలను అప్పనంగా అందించడానికి సిద్ధంగా ఉంటున్నారు. అంటే ఇకనుంచి రెండు రకాల దళారీల నుంచి రైతులు పీడనకు గురవుతారు. ఇంతవరకు కొనసాగుతూ వస్తున్న పాత కమిషన్‌ ఏజెంట్లు, ఇప్పుడు కొత్తగా ఆవిర్భవిస్తున్న కార్పొరేట్‌ సూపర్‌ దళారీలు. మూడో అంచనా ఏమిటంటే, మార్కెట్‌ న్యాయబద్ధంగానే పనిచేస్తుంది కాబట్టి తమ ఉత్పత్తులను నిల్వచేసే స్టాకిస్టులు లేక వ్యాపారుల ద్వారా అదనపు లాభాలను ఇప్పుడు రైతులు పొందగలుగుతారన్నదే. కానీ ప్రైవేట్‌ వ్యాపారులు తాను సంపాదించే అదనపు లాభాల్లో ఒక వాటాను రైతులకు ఇవ్వాలని ఎందుకనుకుంటారు? రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన ధరను ఇవ్వకుండా వీరు తమలోతాము కుమ్మక్కు కారని గ్యారంటీ ఏదైనా ఉందా? ఇంతవరకు జరిగిన విధంగానే కొన్ని సీజన్లలో రైతులకు మంచి ధర ఇస్తూ మిగతా సమయాల్లో రైతులను అణచివేయడాన్ని వీరు కొనసాగించరని ఎవరు

హామీ ఇస్తారు?
నాలుగో అంచనా ఏమిటంటే ప్రభుత్వం వ్యవసాయ మౌలిక పెట్టుబడిలో తన వాటాను పెంచడం ద్వారా రైతాంగానికి తోడ్పడుతుందన్నదే. ఇదో నయవంచన. ఈ 3 చట్టాలు విధానాలుగా మాత్రమే కాకుండా భవిష్యత్తు పర్యవసానాల సూచికలుగా ఉంటున్నాయని ఆర్థికవేత్తల కంటే బాగా రైతులు అర్థం చేసుకుంటారు. మదుపు, క్రమబద్ధీకరణ, విస్తృత కృషి రూపాల్లో వ్యవసాయం నుంచి తాను పక్కకు తప్పుకుంటున్నట్లుగా మోదీ ప్రభుత్వం ఈ చట్టాల రూపకల్పన ద్వారా స్పష్టంగా వెల్లడించింది. ప్రైవేట్‌ వ్యాపారులు ధాన్యపు గిడ్డంగులను, కోల్ట్‌ స్టోరేజీలు నిర్మించడంలో మదుపు పెడతారు కాబట్టి తాను వ్యవసాయ రంగంనుంచి తప్పుకోవచ్చని ప్రభుత్వ భావన.

రైతులకు స్పష్టమైన సంకేతాలు
రైతులకు భవిష్యత్‌ చిత్రపటం ఏమిటన్నది స్పష్టంగా తెలుసు. వ్యవసాయ రంగం నుంచి ప్రభుత్వం తప్పుకోవడం అంటే ఇంతవరకు తాము అనుభవిస్తున్న ఆ మాత్రపు స్వేచ్చను కూడా వారు పొగొట్టుకోవడమే అవుతుంది. ప్రభుత్వం ధాన్య సేకరణనుంచి కూడా తప్పుకోబోతోందని వారు గ్రహించగలరు. సర్కారీ మండీల రద్దు ద్వారా పర్యవసానాలు వీరికి చక్కగా తెలుసు. కనీస మద్ధతు ధరనుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గబోతోందని కూడా వీరు పసిగట్టగలరు. ఆర్థికవేత్తల కంటే రైతులే రాజకీయ సంకేతాలను స్పష్టంగా గ్రహించగలరు. ఇప్పటికే ఈ మూడుబిల్లులు తమ జీవితాలపై వేయబోతున్న ప్రభావాల గురించి పంజాబ్‌ రైతులు పోస్ట్‌ చేస్తున్న వీడియోలను గమనించినట్లయితే మన దేశంలోని కొందరు అత్యుత్తమ వ్యవసాయ ఆర్థికవేత్తల కంటే భారతీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ క్షేత్ర వాస్తవాలను రైతులే చక్కగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టంగా బోధపడుతుంది.

యోగేంద్ర యాదవ్‌
వ్యాసకర్త అధ్యక్షుడు, స్వరాజ్‌ ఇండియా
స్వరాజ్‌ అభియాన్, జై కిసాన్‌ ఆందోళన్‌ సభ్యుడు
మొబైల్‌ : 98688 88986

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top